ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రూ. 3 కోట్ల ఇల్లు హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఆరోపణ చేశారు. అదీ కూడా పౌరసరఫరాల మంత్రి కొడాలి నానిపై. ఏపీలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ విషయంలో భారీ స్కాం జరిగిందని.. అందుకు గాను.. పౌరసరఫరాల శాఖలో జిల్లా స్థాయి అధికారి ఒకరు… మంత్రి కొడాలి నానికి రూ. మూడు కోట్లతో ఇల్లు కట్టించారని ఆరోపించారు. నిజానికి సోము వీర్రాజు మంత్రి కొడాలి నాని ప్రస్తావన చేయలేదు. పౌరసరఫరాల శాఖ అన్నారు కాబట్టి.. ఆయన ఆ శాఖకు మంత్రి కొడాలి నాని కాబట్టి… ఆయననే అన్నారనుకోవాలి. జనం అలాగే అనుకున్నారని.. కొడాలి నాని కూడా భావించి.. వెంటనే మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
పౌరసరఫరాల శాఖపై విచారణ చేయించుకోవచ్చని సలహా ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి విచారణ చేయించుకోవచ్చని… ఆయన సవాల్ చేశారు. మామూలుగా రాష్ట్ర అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఏకపక్షంగా విచారణకు రావు. రాష్ట్రం అడగాలి. అలా అడిగే పరిస్థితి లేదు. ఇది తెలిసి కూడా.. కొడాలి నాని తెలివిగా.. బీజేపీ దర్యాప్తు చేయించుకోవచ్చని సలహా ఇచ్చారు. అంతే కానీ.. తాను ఇల్లు కట్టుకున్నానని కానీ.. దాన్ని ఓ అధికారి దగ్గరుండి కట్టించారని కానీ అంగీకరించలేదు.. అలాగని ఖండించలేదు. విచారణ చేయించుకోండి అని సవాల్ చేశారు. కొంత కాలం నుంచి కొడాలి నాని ఇంటిపై వైసీపీలోనే చర్చ జరుగుతోంది.
గతంలో టీడీపీ హయాంలో.. మంత్రిగా ఉన్న పీతల సుజాతకు ఓ వ్యక్తి నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన వ్యవహారంతో.. కొడాలి నాని ఇష్యూని పోల్చి చూసి.. వైసీపీలోనే సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం రైతులు తాము పండించిన ధాన్యానికి డబ్బులు రాక తంటాలు పడుతూంటే.. ఆశాఖ మంత్రికి మాత్రం.. ఉచితంగా ఇల్లు వచ్చిందని… పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. త్వరలో ఆ ఇల్లు.. ఆ అధికారి పేరు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.