తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. టీఆర్ఎస్ను బలోపేతం చేసుకునే విషయంలో అనుసరించిన వ్యూహాన్నే రేవంత్ రెడ్డి ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేందుకు అమలు చేస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకమా..? అనుకూలమా.. ? అని టీఆర్ఎస్ అధినేత మైండ్ గేమ్ ఆడి.. తెలంగాణకు అనుకూలం అయితే అందరూ టీఆర్ఎస్లో చేరాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. చాలా మందికి తాయిలాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యూహాన్నే కాస్త మార్చి… కాంగ్రెస్ పార్టీలో చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటే.. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై వ్యతిరేకతను ఉపయోగించుకుంటున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకమా..? అనుకూలమా..? అన్న నినాదంతో ఆయన బలమైన నేతల వద్దకు వెళ్తున్నారు.
కేసీఆర్‌ను ఓడించాలంటే… ఐక్యమత్యంగా ఉండాలని.. విడివిడిగా ఉంటే కష్టమని నచ్చ చెబుతున్నారు. కలసి పని చేద్దాం.. రమ్మని పిలుస్తున్నారు. తాజాగా దేవందర్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కుమారులతోనూ చర్చలు జరిపారు. అదే విషయాన్ని వారికీ చెప్పినట్లుగా తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా దేవేందర్ గౌడ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ బీజేపీలో ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు.
బీజేపీలో ఉంటే.. కేసీఆర్‌పై పోరాటం సాధ్యంకాదని.. కాంగ్రెస్‌లో ఉంటేనే మాత్రమే సాధ్యమని చెబుతున్నారు. కేసీఆర్‌పై వ్యతిరేకత ఉన్న లీడర్లనే రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు దూరమైన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు రెడీ అయ్యారు. కేసీఆర్‌పై కరుడుగట్టిన వ్యతిరేకత ఉన్న ఇతర నేతలందర్నీ.. ఏకతాటిపైకి తెచ్చేందుకు రేవంత్.. కేసీఆర్ వ్యూహాన్నే అమలు చేస్తూండటంతో… తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.