ఆదిత్య 369 ముఫ్ఫై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో తమకున్న అనుబంధాన్ని దర్శక నిర్మాతలతో పాటు బాలకృష్ణ కూడా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య 369 సీక్వెల్ పై మరోసారి ఫోకస్పడింది. ఆదిత్య 999 ఎప్పుడన్నదే అందరి ప్రశ్న. దీనికి బాలయ్య దగ్గర సమాధానం ఉంది. 2023లో ఈ సినిమాని పట్టాలెక్కించాలన్నది ఆయన ఆలోచన. ఇప్పటికే బాలయ్య దగ్గర కథ ఉంది. దాన్ని.. స్క్రిప్టు రూపంలో మలచాలంతే. దర్శకుడిగా సింగీతం పేరే వినిపిస్తున్నా.. 2023 నాటికి… సింగీతం ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆయన సెట్లో చురుగ్గా ఉండగలరా? అనేవి ప్రధాన ప్రశ్నలు. ఇప్పటికే ఆయన వయసు 90 దాటేసింది. ఇటీవల ఆయన అనారోగ్యం పాలయ్యారు. కాబట్టి…ఆదిత్య 999కి దర్శకుడిగా ఆయన ఉండే అవకాశం దాదాపుగా లేనట్టే. ఇప్పుడు ఆ బాధ్యతని సైతం బాలయ్యే భుజాన వేసుకునే అవకాశం ఉంది. `నర్తనశాల`తో దర్శకుడిగా మారాలని అనుకున్నారు బాలయ్య. కానీ అనివార్య పరిస్థితుల్లో అది కుదర్లేదు. ఆ తరవాత.. ఆయనకు అంత ఇష్టమైన సబ్జెక్ట్ ఇదే. కాబట్టి ఈసారి.. బాలయ్య మెగా ఫోన్ పట్టడం దాదాపు ఖాయమైంది. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అవ్వబోతోందని, ఇందులో బాలయ్య కథానాయకుడు కాదని, ఓ కీలకమైన పాత్రలో మాత్రమే కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.