తెలంగాణలో వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నానని ఆయన సన్నిహితులకు చెబుతున్నారు. జైభీమ్ పార్టీ పెడతారని.. ఆయన అంటున్నారు. కానీ ఆయనను టీఆర్ఎస్ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని.. హుజూరాబాద్ నుంచి ఆయనను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. ఐపీఎస్ అయినప్పటికీ.. చాలా కాలంగా… ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పోలీసు శాఖకు సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నారు.
ఆయన క్యాడర్ అదనపు డీజీపీ. అయితే చేసే పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారిగా ఉన్నారు. గురుకులాల విషయంలో ఆయన సంస్కరణలు తీసుకు వచ్చారు. స్వేరో పేరుతో.. ఓ రకమైన సమాంతర వ్యవస్థను నెలకొల్పారు. ఈ వ్యవస్ధ ద్వారా దైవదూషణకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో కూడా కలకలకానికి కారణం అయింది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సర్వీస్ నుంచి వైదొలగాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.
అప్పుడు ఆయన తనను తాను సమర్థించుకున్నారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఆయనపై ఎలాంటి వ్యతిరేక చర్యలు కానీ.. వ్యాఖ్యలు కానీ చేయలేదు. కనీసం పోస్టింగ్ కూడా మార్చలేదు. ఇప్పుడు నేరుగా ఆయనే సర్వీస్ నుంచి వైదొలిగారు. త్వరలో పార్టీ పెడతారో.. లేకపోతే టీఆర్ఎస్లో చేరుతారో కానీ… రెండింటిలో ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఆయన రాజకీయ ఆకాంక్షలతోనే సర్వీసు వదులుకుంటున్నారని చెప్పక తప్పదు.