ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. జనసేన పార్టీ నిరుద్యోగుల పక్షాన ఇవాళ ఆందోళన చేపట్టగా, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దానిని సునాయాసంగా అణిచేయగలిగింది. వివరాల్లోకి వెళితే …
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్ మాట్లాడుతూ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయని, తమ ప్రభుత్వం రాగానే వీటన్నిటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ యువత 2019 ఎన్నికలలో పెద్ద ఎత్తున జగన్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అయినప్పటికీ జగన్ ప్రభుత్వం లో ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడం, పైగా నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ప్రశ్నిస్తే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రభుత్వం మాటల గారడి చేయడం, పోనీ అదే వాలంటీర్లు జీతం పెంచమని అడిగితే, అవి ఉద్యోగాలు కాదు కేవలం సేవ అంటూ ప్లేటు ఫిరాయించడం ఇవన్నీ నిరుద్యోగ యువతకు ప్రస్తుత ప్రభుత్వం పై అసహనం పెరగడానికి కారణం అయ్యాయి. వీటన్నింటికి తోడు ఇటీవల ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అంటూ ఒక ప్రకటన విడుదల చేసి అందులో అత్యంత తక్కువగా ఉద్యోగాలు ప్రకటించడం ఇవన్నీ నిరుద్యోగులు ఆందోళన చేపట్టడానికి కారణం అయ్యాయి.
తాజాగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ జనసేన పార్టీ ఆందోళన చేసింది . ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు జనసేన నేతలు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు పదివేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా జగన్ తటపటాయిస్తూ ఉన్నాడని, నిరుద్యోగుల పక్షాన జనసేన పార్టీ నిలబడుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ జనసేన నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసింది. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కు భంగం కలిగించడం ద్వారా జగన్ నియంత లా ప్రవర్తిస్తున్నాడు అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యువతలో కూడా తాత్కాలిక తాయిలాలకు కోసం ఆశపడి తప్పు చేశామని , శాశ్వతంగా వచ్చే ఉద్యోగాలు ముఖ్యం తప్ప తాత్కాలికంగా ఇచ్చే తాయిలాలు కాదని, యువతలో కూడా అవగాహన పెరిగింది. మరి జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల బాధలు తీర్చేలా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది వేచిచూడాలి.