తెలంగాణలో హూజూరాబాద్ ఉపఎన్నికలు రాను రాను ఉద్రిక్తతంగా మారుతున్నాయి. దాడులు.. హత్యల ఆరోపణల వరకూ వెళ్తున్నాయి. పాదయాత్ర ప్రారంభించిన ఈటల రాజేందర్ తనపై దాడికి ఓ మాజీ మంత్రి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు అనేక చర్చలకు కారణం అవుతోంది. తనపై దాడి కోసం ఓ మాజీ మావోయిస్టుతో డీల్ సెట్ చేసుకున్నారని.. దానికి సంబంధించిన ఆధారాలు.. నేడో రేపో బయటపెడతానని ఈటల ప్రకటించారు. దీంతో అన్ని పార్టీల నేతలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. అలాంటి రాజకీయం కూడా ప్రారంభమయిందా అని ఆశ్చర్యపోయారు.
అయితే ఈటల ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. కానీ వెంటనే.. మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఈటల ఆరోపణలు అవాస్తవమని.. కావాలంటే సీబీఐతో అయినా విచారణ చేయించుకోవాలని సూచించారు. అంతే కాదు.. ఈటలతో తనకు వ్యక్తిగత కక్ష లేదని.. రాజకీయంగా పోరాడుతున్నామని వివరణ ఇచ్చారు. సానుభూతి కోసమే.. ఈటల డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఈటల ఆరోపణలు చేయడం.. గంగుల స్పందించడం ఇప్పుడు .. కలకలం రేపింది. తనపై దాడి చేస్తారని ఈటలకు ముందుగానే స్పష్టమైన సమాచారం అందిందని.. ఆయన ఆషామాషీగా ఆరోపణలు చేయలేదని.. ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ వివాదం మరింత ముదిరిన తర్వాత ఈటల రాజేందర్ సాక్ష్యాలు బయట పెడతారని చెబుతున్నారు.
అసలే హుజూరాబాద్‌లో హై టెన్షన్ వార్ జరగుతున్న సమయంలో దాడులు.. హత్యల అంశం తెరపైకి రావడం … పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో గెలుపు కోసం.. అటు టీఆర్ఎస్.. ఇటు ఈటల పూర్తి స్థాయిలో శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నారు. టీఆర్ఎస్కు అదనంగా అధికార బలం ఉంది. బీజేపీకి కూడా ఉన్నా.. అది కేంద్రంలో కావడంతో.. ఇక్కడ యంత్రాంగంపై ప్రభావం చూపలేని పరిస్థితి ఉంది. ముందు ముందు హూజూరాబాద్ వార్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.