హుజూరాబాద్ టిక్కెట్ ఆశిస్తూ టీఆర్ఎస్లో వారానికొకరు చేరుతున్నారు. ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థి అవుతారో తెలియదు కానీ… చేరికలు మాత్రం వారానికొకటి ఉండేలా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ… కోవర్ట్ గా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఆడియో టేప్ బయటపడిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం వెళ్లి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అక్కడ తన బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్కు కోవర్ట్‌గా పని చేసి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటివేయించుకునే పరిస్థితికి వచ్చినందున.. టీఆర్ఎస్లో చేర్చుకోకపోతే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుకున్నారేమో కానీ.. భారీ హంగామా మధ్య కౌశిక్ రె్డ్డిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆయన చేరిక కార్యక్రమంలోనే టిక్కెట్ పై హామీ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. హుజూరాబాద్‌లో ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై ఇంత వరకూ టీఆర్ఎస్ హైకమాండ్‌కు స్పష్టత లేదు. రోజుకో సమీకరణం చూసుకుంటూ.. నేతల్ని చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఎల్.రమణతో పాటు ముద్దసాని కుటుంబం నుంచి మరొకర్ని పార్టీలో చేర్చుకున్నారు. నిన్నంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు వినిపించింది. అలాగే మరికొంత మంది అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక పెద్దిరెడ్డి.. కౌశిక్ రెడ్డి సహా పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అయినా కేసీఆర్ సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. మరింత బలమైన నేత కోసం.. కేసీఆర్ చూస్తున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో అన్ని రకాల సమీకరణాలను చూసుకునేందుకు వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారని చెబుతున్నారు. అయితే తర్వాత ఈ చేరికే ఇబ్బందిపెడతాయన్న చర్చ టీఆర్ఎస్ లో నడుస్తోంది. టిక్కెట్ దక్కని వారు.. మనస్ఫూర్తిగా పని చేయరని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఏ పని.. రాజకీయంగా లాభనష్టాలు చూసుకోకుండా చేయరని.. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు.