కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరూ చనిపోలేదు..! .. ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది.. దేశ ప్రజంలదరికీ యస్ ఆర్ నో అని పోల్ పెడితే… 99 శాతం మంది నో అని చెబుతారు. ఎందుకంటే.. ఆక్సిజన్ కొరత కారణంగా ఎంత మారణహోమం జరిగిందో అందరికీ తెలుసు. కానీ ఒక్క శాతం మంది ఉంటారు. .. ఎలాంటి ఆక్సిజన్ మరణాలు సంభవించలేదని చెప్పేవారు. వారే పాలకులు. ఎందుకంటే.. తమ తప్పిదం వల్ల మనుషులు చనిపోయారని వారు అంగీకరించరు. ఇప్పుడు ఆ ఒక్క శాతం మంది పార్లమెంట్లో.. అసెంబ్లీల్లో.. కోర్టుల్లో సమాధానాలు ఇస్తూ ఉంటారు.
తాజాగా రాజ్యసభలో కరోనా అంశంపై జరిగిన చర్చలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా దేశంలో చనిపోలేదని కేంద్రం భారమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే.. దీనికి ఓ చిన్న ట్యాగ్ లైన్ పెట్టింది. ఏమిటంటే.. రాష్ట్రాల సమాచారం మేరకు అని చెప్పింది. తమ రాష్ట్రంలో.. ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని.. అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయట. అంటే వారు కూడా ఆ ఒక్క శాతం జాబితాలో ఉన్నారన్నమాట. ఆక్సిజన్ కొరత లేకపోతే.. మనుషులు పిట్టల్లా రాలిపోకపోతే.. ప్రపంచం మొత్తం… ఉరుకులు పరుగుల మీద ఎందుకు ఇండియాకు ఆక్సిజన్ పంపిందో కేంద్రం చెప్పాల్సి ఉంది. వందల కొద్ది మరణాలు .. శ్మశానాల ముందు బారులు తీరిన మృతదేహాలు.. ఆక్సిజన్ కోసం కోర్టుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వార్తలతోనే సెకండ్ వేవ్ నడిచిపోయింది.
ఏపీలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 30మందికిపైగా చనిపోయారని ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది. ఇవేమీ లెక్కలోకిరాలేదు. చివరికి ధర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన.. సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలన్న లక్ష్యంతో వేల కొద్దీ ఆక్సిజన్ ప్లాంట్లకు కేంద్రం నిధులిస్తోంది. అయినా తప్పులు జరిగితే తప్పు అని ఒప్పుకుని దిద్దుకోవాలి కానీ.. అసలు తప్పే జరగలేదని ప్రజల్ని నమ్మించాలనుకోవడం ఏమిటన్న విమర్శలు ప్రభుత్వంపైన వస్తాయి. అయినా పట్టించుకునేవారెవరు ఉంటారు.