ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా.. సంక్షేమ క్యాలెండర్లో ఉన్న దాని ప్రకారం.. లబ్దిదారులకు నగదు బదిలీ చేసేందుకు మీట నొక్కే విషయంలో తేడా రాకూడదని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. ఈ నెల జీతాలు.. నిన్నామొన్నటిదాకా ఉద్యోగులకు పంపిణీ చేస్తూనే ఉన్నా.. తాజాగా.. రూ. ఐదు వందల కోట్లను… కాపు నేస్తం పథకం కోసం సమీకరించుకున్నారు. ఈ రోజు.. జగన్ మీట నొక్కి ఆ సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. కాపు మహిళలకు ఏడాదికి రూ. 75వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మొదటి ఏడాది దాన్ని సీఎం జగన్ ప్రారంభించలేకపోయారు. రెండో ఏడాది అంటే.. గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించి.. తొలి విడతగా.. పదిహేను వేలు జమ చేశారు. ఈ ఏడాది రెండో విడత మొత్తం రూ. పదిహేను వేలు విడుదల చేస్తున్నారు.
రాష్ట్రం మొత్తం మీద..కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3 లక్షల 27వేల మంది మహిళలను ఈ పథకాలకు అర్హులుగా తేల్చారు. వారికి నగదు జమ చేస్తారు. బ్యాంకుల్లో వారికి పాత అప్పులు ఉంటే.. వాటికి ఈ మొత్తాలను జమ చేసుకోకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే.. కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. అంటే.. పట్టణాల్లో పన్నెండు వేలు.. పల్లెల్లో పదివేలు ఆదాయం మించకూడదు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చు. అంత కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు ఉన్నా అర్హులు కాదు. నాలుగు చక్రాల వాహనం ఉన్నా అర్హత ఉండదు. కుటుంబంలో ఎవరైనా ఇన్‌కం ట్యాక్స్ చెల్లిస్తే కూడా అర్హులు కారు.
అయితే ఈ పథకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో రెడ్లను కాపులుగా చెబుతూంటారు. కాపుల పేరుతో.. క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తారు. దీంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే అక్కడ లబ్ది జరిగిందని ఆరోపణలు వచ్చాయి.కొన్ని చోట్ల విచారమ జరిగింది. గ్రామాలను యూనిట్‌గా తీసుకుని పరిశీలన చేస్తే.. 70 శాతం మంది రెడ్డిసామాజికవర్గం వారికి కాపు నేస్తం నిధులు అందాయి. వీటన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే అర్హులైన వారు నష్టపోతారు.