ఆంధ్రాలో అంతా గల్లంతయిందని.. అక్కడేమీ లేదని.. అభివృద్ధి అంతా తెలంగాణలోనే ఉందని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మోహమాటంగా చెప్పారు. పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని చాలా ఉత్సాహంగా ఈ మాటలు చెప్పారు. కేసీఆర్ ఈ మాటలు చెప్పినప్పుడు.. టీఆర్ఎస్‌భవన్‌లోని ఆ సమావేశ మందిరం… చప్పట్లతో మార్మోగిపోయింది. తెలంగాణ అభివృద్ధి సంగతేమో కానీ.. అంధ్రాలో అంతా గల్లంతేనన్నప్పుడు మాత్రం.. చాలా ఉత్సాహం.. టీఆర్ఎస్ నేతలకు వచ్చింది. బహుశా.. కాంపిటీటర్ … దివాలా తీసేసిన తర్వాత.. తమకు పోటీ లేదన్న ఉత్సాహం వారికి వచ్చి ఉండవచ్చు.
కేసీఆర్ మాటలపై సోషల్ మీడియాలో వెంటనే ట్రోలింగ్ ప్రారంభమయ్యాయి. అయితే ఆయనను టార్గెట్ చేయకుండా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… ట్రోలింగ్ చేస్తున్నారు. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా అయిందని… ఏపీ సర్కార్ కనీసం.. తాము ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామని చెప్పలేని దుస్థితికి చేరిందన్న విమర్శలు చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. తెలంగాణలో రోజుకో పెట్టుబడి పదం వినిపిస్తోంది. కిటెక్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. కొన్నాళ్లకు తెలంగాణలో సగం హైదరాబాద్‌గా మారిపోయినా ఆశ్చర్యం ఉండదు. అక్కడ ఎంత రాజకీయం ఉన్నా… సంక్షేమం ఉన్నా… ప్రజల ఆస్తుల విలువను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది. అది అక్కడి ప్రభుత్వ విజన్.
ఏపీ కూడా… తెలంగాణతో పోటీ పడాలి అనుకుంటే.. ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచాలి అనుకుంటే.. డెలవప్‌మెంట్ విజన్ ఎంచుకునేది. కానీ అక్కడ జరుగుతున్నది వేరు. అప్పులు చేయడం.. ఆస్తులు తెగనమ్మడం ద్వారా అయినా సరే… ప్రజల అకౌంట్లలో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం అనే ఒక్క మిషన్ మాత్రమే అమలవుతోంది. అందుకే పెట్టుబడుల వార్తల్లేవ్… ఉపాధి అవకాశాల్లేవ్… ఇసుక సహా ప్రతీ రంగంలోనూ… “ఆలోచనల దివాలా”తో ప్రజలు.. అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కానీ అక్కడి ప్రజల బుర్రల్లో ఇంకా కులమే ఉంది. అది ఉన్నంత కాలం .. ఎంత మంది కేసీఆర్‌లు హేళన చేసినా…. ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు అసలు పట్టించుకోరు. ఎందుకంటే.. కొత్తగా గల్లంతవడానికి అక్కడ ఏమీ మిగిలే పరిస్థితి లేదు మరి..!