పునర్జనల కాన్సెప్ట్ రాజమౌళికి బాగా కలిసొచ్చినట్టుంది. `మగధీర` పునర్జన్మ కథే. `ఈగ` కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్. ఇప్పుడు RRR లో కూడా రాజమౌళి ఇదే నేపథ్యం ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ ఇది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా… చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరివీ వేర్వేరు ప్రాంతాలు, నేపథ్యాలు. అయినా వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందన్నది రాజమౌళి ఊహ. కథంతా… కథంతా స్వాతంత్య్రానికి పూర్వం జరుగుతుంది. ఈ కథలో అల్లూరి, కొమరం భీమ్ ఇద్దరూ చనిపోతారని, మళ్లీ పునర్జన్మ ఎత్తుతారని తెలుస్తోంది. పునర్జన్మ కాన్సెప్ట్ క్లైమాక్స్‌కి ముందే జరుగుతుందని, ఆ ఎపిసోడ్ చాలా ఆసక్తి కరంగా ఉంటుందని సమాచారం. భారతదేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి వచ్చిన తరవాత.. ఈ దేశ పరిస్థితి ఏమిటి? కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మరో జన్మ ఎత్తి, మళ్లీ కలుసుకుంటే ఎలా ఉంటుందన్న అందమైన ఊహతో ఈ కథ ముగుస్తుందని, ఆ సన్నివేశాలు భావేద్వేగంగా, ఆసక్తికరంగా సాగుతాయని, ఓరకంగా RRR కి కాస్త దారి వదులుతూ క్లైమాక్స్ ఉంటుందని తెలుస్తోంది. RRR సీక్వెల్ దాదాపుగా ఉండదు కానీ…. ఉండొచ్చేమో.. అన్న ఆలోచన మాత్రం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ రగిలించేలా రాజమౌళి ఆ క్లైమాక్స్ తీర్చిదిద్దాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.