ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మరోసారి ఆలయాల యాత్రను ప్రకటించారు. 24వ తేదీ నుంచి అంటే… శనివారం నుంచే వారు యాత్రకు బయలుదేరుతున్నారు. సోము వీర్రాజుతో పాటు ఎమ్మెల్సీ మాధవ్.. మరికొంత మంది ప్రముఖులు ఈ యాత్రలో పాలు పంచుకుంటారు. ముందుగా విజయవాడ కనకదుర్గమ్మ అలయాన్ని సందర్శిస్తారు. అయితే బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా ఈ యాత్రను ఆలయాల యాత్రగా చెబుతున్నారు. దాడికి గురైన ఆలయాల యాత్రగా చెప్పడం లేదు. అలా చెబితే ప్రభుత్వం అడ్డుకుంటుందని అనుకున్నారేమో కానీ.. దైవ దర్శనాలకన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. దాడికి గురైన ఆలయాలను కూడా పరిశీలిస్తామని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికలకు ముందే కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దేవాలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలను కలుపుతూ యాత్ర చేయాలని అనుకున్నారు. కొన్ని చోట్ల జన జాగృతి సభలను నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ వారి యాత్ర ప్రారంభ సమయంలోనే పంచాయతీ ఎన్నికలను ప్రకటించడంతో… జనసేనతో కలిసి అన్ని చోట్లా పోటీ చేయాలన్న లక్ష్యంతో రథయాత్రను ఆపేస్తున్నట్లుగా సోము వీర్రాజు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు … ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికలు జరగడంతో ఇప్పటి వరకు మళ్లీ యాత్రను ప్రారంభించలేకపోయారు.
ఇటీవలి కాలంలో ఏపీలో మత మార్పిళ్ల అంశం కలకలం రేపుతోంది. ఆరెస్సెస్ కూడా విమర్శలు చేస్తోంది. మరో వైపు ఆలయాలపై దాడుల విషయంలో బీజేపీ సరైన విధంగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయిందన్న అభిప్రాయం.. పార్టీ హైకమాండ్ వ్యక్తం చేసిందని.. అందుకే మళ్లీ.. రథయాత్రను ఖరారుచేసుకున్నారని అంటున్నారు. యాత్రకు హైప్ రావడానికి కేంద్రమంత్రుల్ని పిలిపించేఅంశాన్ని పరిశీలిస్తున్నారు.