తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అధికార పార్టీకి భవిష్యత్ నేతగా ఉన్న ఆయన పుట్టినరోజును.. ధూంధాంగా సెలబ్రేట్ చేస్తున్నారు. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలను పార్టీ నేతలు ఇచ్చారు. టీవీ చానల్స్‌తో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. ఇక సోషల్ మీడియా ట్రెండింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలందరూ పండుగలా చేసుకుంటున్నారు. కొంత మంది ప్రకటనలు ఇస్తే.. మరికొంత మంది .. రక్తదాన శిబిరాలు పెడుతున్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో డబ్బులు దుబారా చేయవద్దని.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపు ఇచ్చినా… పార్టీ నేతలు మాత్రం .. తాము చేయాలనుకున్నది చేస్తున్నారు.
నిజానికి ఈ సారి ఇంత భారీగా పుట్టినరోజు వేడుకలు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటి సారి వచ్చిన పుట్టిన రోజు కాదు. కానీ కేటీఆర్ సీఎం అనే అంచనా ఈ ఏడాది అమల్లోకి వస్తుందని గట్టిగా టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నట్లుగా ఉన్నారు. కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవాలనుకున్న వారు.. కొత్తగా మంత్రి పదవిని పొందాలనుకున్న వారు.. ఇలా అనేక మంది అనేక రకాలుగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
ఒక్క రాజకీయవర్గాల నుంచే కాకుండా.. ఇతరుల నుంచి కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామోజీరావు వంటి ప్రముఖులుకూడా ఆయన గొప్ప పదవులు అలంకరించాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు. టీఆర్ఎస్ లో ఈ ఉత్సాహం చూస్తూంటే.. కేటీఆర్ ఖచ్చితంగా సీఎం అయ్యే క్షణం ఎంతో దూరంలో లేదని.. అంచనా వేస్తున్నారు. పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని తగ్గించాలని కేటీఆర్ కూడా అనుకోవడం లేదు కానీ.. వీలైనంత వరకూ వారిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వంద ట్రై స్కూటర్లనును వికలాంగులకు పంపిణీ చేస్తున్నారు. పార్టీ నేతలకూ అలాంటి సలహాలే ఇచ్చారు. మొక్కలు నాటాలని కోరారు. ఈ సేవా కార్యక్రమాలపై ఎంత మంది టీఆర్ఎస్ నేతలు దృష్టి పెడతారో మాత్రం చెప్పలేం..!