“పెగాసస్” నిఘా వ్యవహారం ఇప్పుడు దేశంలో రాజకీయ సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. ఇజ్రాయిలీ కంపెనీ ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతుంది. ఇన్స్టలేషన్ చార్జీలే రూ.ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తుంది. నిఘా పెట్టాల్సిన ఫోన్ను బట్టి చార్జీలు వసూలు చేస్తుంది. ఐదు ఫోన్లపై నిఘా పెట్టేందుకు రూ. ఐదు కోట్ల వరకూ చార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో పెగాసస్ నిఘాను మూడు వందల నెంబర్లకుపైగా ఉపయోగించారని.. అందరి వివరాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. అన్ని నెంబర్లు, ఫోన్లపై నిఘా పెట్టాలంటే.. దాదాపుగా రూ. వెయ్యి కోట్లపైనే ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరి ఈ సొమ్మంతా ఎక్కడ్నుంచి తెచ్చి పెట్టారు… ఏ ఖాతాలో చూపించారనే దానికి విపక్షాలు పరిశోధన చేసి .. కొన్ని వివరాలు ప్రకటిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు పేరు మీద ఈ పెగాసుస్ వ్యవహారాన్ని నడిపించారని అంటున్నారు. అజిల్ ధోబాల్ కు కేటాయించిన బడ్జెట్.. అనూహ్యంగా పెంచుకుంటూ పోవడమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రక్షణ సలహాదారుగా ఉన్న అజిల్ ధోబాల్ బడ్జెట్ 2016-17లో రూ. 33 కోట్లు… కానీ ఆ తర్వాత ఏడాది నుంచి విపరీతంగా పెరిగిపోయింది. 2017-18లో రూ. 333 కోట్లు కేటాయించారు.
ఆ తర్వాత ఏళ్లలోనూ అలాగే కొనసాగించారు. జాతీయ భద్రతా సలహాదారుగా ధోబాల్.. అత్యంత సున్నితమైన అంశాలను డీల్ చేస్తారు. ఉగ్రవాదులపై నిఘా వ్యవహారాలను ఆయనే చూస్తారు. దీంతో పెగాసస్ విషయంలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆయన ద్వారానే ఇప్పుడు నిఘా పెట్టించారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన చరిత్ర ధోబాల్కు ఉంది. అప్పుడుకూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో విచారణ జరిగి మొత్తం వివరాలు బయటకు తెలిస్తే కానీ అసలేం జరిగిందో అంచనా వేయడం సాధ్యం కాదు.