ఐపీఎస్ పదవిని వదిలేసిన స్వేరో ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్లో చేరుతాడని ప్రచారం జరిగినా అదంతా ఒట్టిదేనని.. ఆయన ప్రకటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఆయన టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ఓ వైపు హుజూరాబాద్‌లో దళితుల ఓట్ల కోసం.. కేసీఆర్ ఎక్కడా లేని స్కీములు ప్రవేశ పెడుతూంటే… అదే దళిత వర్గాల్లో కాస్త ఇమేజ్ తెచ్చుకున్న ప్రవీణ్ కుమార్.. వాటిని అంతా ఫార్స్‌గా తోసి పడేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడటమేతన విధానమని చెప్పకనే చెబుతున్నారు.
గతంలో దైవదూషణ చేసినట్లుగా ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు కూడా ఉన్నాయి. అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రెండు రోజుల్లోనే కరీంనగర్లో కేసు నమోదైంది. ఇలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పుకొచ్చారు. తనపై కేసు పెట్టడాన్ని ప్రవీణ్ కుమార్ ఓ అవకాశంగా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు. అందరం కలిసి బహుజన సమాజలు సృష్టించుకుందామని పిలుపునిచ్చారు. దళిత ముఖ్యమంత్రి అని గతంలో ఓట్లు దండుకున్నట్లుగా.. మళ్ళీ మోసం చేస్తారని.. అలాంటి చాన్సివ్వకండని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరం కలిసి అధికారం దక్కించుకోవాలని..ఇప్పుడు రాకపోతే ఇటువంటి అవకాశము రాదని దళితులకు ఆయన పిలుపునిస్తున్నారు.
అంతే కాదు ప్రభుత్వంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నా…ఆ వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేశారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ దళితులకు పంచాలని అనుకుంటున్న రూ. వెయ్యి కోట్లు గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని చెప్పుకొచ్చారు. దళితుల ఉన్నతి కోసమే తాను పదవులను త్యాగం చేశానని చెబుతున్నారు. అంటే.. ఆయన స్పష్టమైన రాజకీయ లక్ష్యంతోనే ఉన్నారని అంచనా వేస్తున్నారు.