మహబూబాబాద్ వైసీపీ ఎంపీ మాలోతు కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రూ. పదివేల జరిమానా కూడా విధించింది. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్న అంశంపై కేసు నమోదయింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె డబ్బులు పంచినట్లుగా ఆధారాలు ఉండటంతో.. ఆరు నెలల జైలు శిక్ష. రూ. పదివేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జరిమానాను కవిత వెంటనే చెల్లించారు. శిక్ష అమలుపై… ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని కల్పించింది.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించడంతో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఈ కేసులను శరవేగంగా పరిష్కరిస్తోంది. ఈ క్రమంలో పలువురిపై కేసులు వీగిపోగా.. మరికొందరికి శిక్షలు ఖరారవుతున్నాయి. మాలోతు కవితకు ఆరు నెలలు మాత్రమే శిక్ష పడింది. దీంతో .. ఆమె పదవికి వచ్చిన గండమేమీ లేదు. పై కోర్టులో స్టే లభించకపోయినా.. ఆమె జైలు శిక్ష అనుభవించినా… ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. అనర్హతా చట్టం ప్రకారం.. కనీసం రెండేళ్లు జైలు శిక్ష పడితేనే.. అనర్హులవుతారు.
కొద్ది రోజుల కిందటే..మాజీ మంత్రి దానం నాగేందర్‌కు కూడా కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడి మోపిదేవిపై ఉన్న ఓ ఏసీబీ కేసులోనూ విచారణ జరుగుతోంది. మరికొంత మందికి జరిమానా విధించింది. ఇతర రాష్ట్రాల్లో కన్ా.. తెలంగాణలో ప్రజాప్రతినిధుల కోర్టు శరవేగంగా విచారణలు జరుపుతోంది.