రిషబ్ శెట్టికి కన్నడలో మంచి మార్కెట్ ఉంది. తన కథలు, సినిమాలు, పాత్రలు… ఎటు చూసినా ఎక్కడో చోట కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. `బెల్ బాటమ్`తో తన స్టైల్ ఏమిటో? తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థమైంది. ఇప్పుడు `హీరో`గా వచ్చాడు. కన్నడలో ఈయేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమాని అదే పేరుతో డబ్ చేసి, `ఆహా`లో విడుదల చేశారు.
హీరో ఓ బార్బర్. తను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ.. ఆ అమ్మాయి మాత్రం హ్యాండిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఐదేళ్లయినా ఆమె పై ప్రేమ చావకపోవడంతో… ఏకంగా ప్రేమించిన అమ్మాయినే చంపేయాలనుకుంటాడు హీరో. తనని వెదుక్కుంటూ ఇంటికి వెళ్తాడు. అయితే.. ఇంట్లో ఆల్రెడీ.. ఓ హత్య జరుగుతుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్నదే కథ.
రెండు మూడు లైన్లలో చదువుతుంటే – ఇదో మర్డర్ మిస్టరీ అనుకుంటారు. సీరియస్ గా సాగే సినిమా అనుకుంటారు. కానీ.. దాన్ని వీలైనంత లైటర్ వేలో చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. హీరో.. హీరోయిన్ని వెదుక్కుంటూ ఎస్టేట్‌కి వెళ్లడంతో కథ మొదలవుతుంది. అయితే అసలైన డ్రామా ఆ ఎస్టేట్ లోనే మొదలవుతుంది. కథని చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. తొలి సన్నివేశాలు చూస్తే… కచ్చితంగా ఇది మరో డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. ఇంట్రవెల్ వరకూ…. అదే ఫీలింగ్ కలుగుతుంది. శవాన్ని ఇంట్లో ఉంచుకుని చేసే డ్రామా నచ్చుతుంది. ఆ ఇంట్లో కుక్కర్ విజిల్ కోసం ఓ పాత్ర తెగ వెదికేస్తుంటుంది. దాని చుట్టూ నడిచే సన్నివేశాలు నవ్విస్తాయి. ఇంట్రవెల్ వరకూ ఎలాంటి కుదుపుల్లేకుండా సాగిన సినిమా.. ఆ తరవాత పూర్తిగా డౌన్ ఫాల్ లో పడిపోతుంది. హంట్ బిగెన్ అంటూ.. ఇంట్రవెల్ కార్డ్ దగ్గర ఆసక్తి రేపిన దర్శకుడు.. దాన్ని కడవరకూ కొనసాగించలేకపోయాడు. ఎస్టేట్ చుట్టూ హీరో హీరోయిన్లు పరుగులు పెట్టడం, వాళ్లని విలన్ గ్యాంగ్ పట్టుకుని చిత్రహింసలకు గురి చేయడం తప్ప.. ద్వితీయార్థంలో ఏం ఉండదు. చివర్లో ఏదో భయంకరమైన ట్విస్టు వస్తుందని ఆశిస్తారంతా. అదేం లేకుండా.. చప్పగా ముగించేశాడు దర్శకుడు. దాంతో ఈ సినిమా ఎందుకు తీశాడు? అన్న ప్రశ్న రేకెత్తుతుంది.
కన్నడలో ఇది వరకు చాలా లో క్వాలిటీ సినిమలొచ్చేవి. కానీ వాళ్లు కూడా పంథా మార్చారు. భారీ బడ్జెట్లు పెడుతున్నారు. `హీరో` చూస్తే… బడ్జెట్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా అంతా దాదాపుగా ఒకే లొకేషన్ లో సాగుతుంది. టేకింగ్ అంత గొప్పగా ఏం లేదు. “చిన్నప్పుడు మన మెమొరీ పవర్ పెంచడానికి హార్లిక్సూ.. బూస్టూ తాగించేవాళ్లు. దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలిసేది ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోయినప్పుడు“ అనే డైలాగ్ బాగుంది. వీటితో పాటు కొన్ని ఫన్నీ సంభాషణలు నచ్చుతాయి. సినిమా నిడివి తక్కువే. అయినా సరే.. అక్కడక్కడ బోర్ కొడుతుంది. మొత్తానికి బాగా మొదలెట్టి, చప్పగా ముగించిన సినిమాల జాబితాలో… `హీరో` చేరిపోతుంది.