ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న కాలనీలు నిర్మిస్తోంది. లబ్దిదారులకు సెంటు భూమిని పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చింది.అందులో మూడో ఆప్షన్ .. ప్రభుత్వమే కట్టివ్వడం. కానీ ఇప్పుడు.. యూటర్న్ తీసుకుంది. డబ్బులు ఇస్తాం..మీరే కట్టుకోండని ఫోర్స్ చేస్తోంది. అంతే కాదు ఉన్న పళంగా ఇల్లు కట్టుకోకపోతే.. ఇంటి స్థలాన్ని క్యాన్సిల్ చేస్తామని కూడా హెచ్చరించారు. దాంతో చాలా మంది సొంత డబ్బులు పెట్టుకుని పునాదులు వేసుకున్నారు. మొత్తంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇస్తానని చెబుతున్న సొమ్ము రూ. లక్షా 80వేలు మాత్రమే. ఇంత చిన్న మొత్తంతో ఇల్లు ఎలా పూర్తవుతుందన్నదానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
కానీ అంతకు మించిఖర్చు కాదని సాక్షాత్తూ గృహనిర్మాణ మంత్రి రంగనాథరాజు తేల్చేస్తున్నారు. ఓ ఇల్లు కట్టుకోవడానికి అంత కంటే ఎక్కువ ఖర్చు అవుతుందా అని ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. పైగా.. తాము ఇసుక ఉచితంగా.. సిమెంట్ తక్కువ ధరకు అందిస్తున్నామని.. ఇంకా ఏం కావాలని చెప్పుకొచ్చారు. మంత్రి ప్రకటనపై లబ్దిదారుల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. ప్రభుత్వమే కట్టి ఇస్తే తమకు ఏ సమస్యలు ఉండబోవని.. కానీ ఇప్పుడు ఇల్లు పేరుతో అప్పుల పాలు చేస్తున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వ పరంగా మౌలికసదుపాయాల పనులు ఏమీ జరగలేదు.
కానీ అక్కడ ప్రజలు పునాదులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ అనేక మంది ప్రజలు.. ప్రభుత్వమే ముందు చెప్పినట్లుగా కట్టివ్వాలని… రూ. లక్షా ఎనభై వేలతో ఇళ్లు కట్టుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఆ బాధ్యత నుంచి వైదొలిగింది. కట్టుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తోంది. దీంతో నిరుపేదలే అప్పుల పాలవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమంటున్నారు.