ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయంలో కొద్దిరోజులుగా అనేక విమర్శలు వస్తున్నాయి. అందులో ప్రధానమైనది స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసిన రూ. పాతిక వేల కోట్ల అప్పులు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా ఇవ్వలేదని వాదిస్తోంది. లేదు గ్యారంటీ ఇచ్చారని విపక్షాలు పత్రాలు బయట పెడుతున్నాయి. అదే సమయంలో ఈ అప్పుపై కేంద్రానికి , శాసనసభకు సమాచారం ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. అంతకు మించి ఈ కార్పొరేషన్ అప్పుల కోసం.. ఏపీ సర్కార్ మద్యం ఆదాయాన్ని మళ్లిస్తోంది. అసలు నేరుగా ప్రభుత్వానికి రాకుండా డిపోల నుంచే ఎస్డీసీకి నగదు మళ్లించేలా.. అక్కడ్నుంచి బ్యాంకులకు తిరిగి కట్టేలా నిబంధనలు రూపొందించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలు వస్తున్నాయి.
ఇది ప్రభుత్వం, అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తూండటంతో… జీవీఎల్ నరసింహారావు తెరపైకి వచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగానే ప్రసంగించినా.. మధ్యలో ఈ వివాదం నుంచి బయటపడే మార్గాలనూ సూచించారు. తక్షణం స్టేట్ డెలవప్మెంట్ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయాలన్నారు. ఎస్డీసీ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లుగా ఉందని.. అందుకే.. సవరణలు చేస్తే.. అది ఉండదన్నట్లుగా ఆయన సలహా ఉంది. ఇవ్వాల్సిన సలహాలు.. సూచనలు.. విమర్శల రూపంలో ఇచ్చిన తర్వాత.. అన్నింటిపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేస్తామని జీవీఎల్ చెప్పుకొచ్చారు.
నిజంగా ఉల్లంఘనలు జరిగాయని ఖచ్చితమైన సమాచారం ఉంటే నేరుగా ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా వారిదే. కానీ.. ఆయన మాత్రం ప్రెస్ మీట్ పెట్టి.. తప్పుల్ని కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిజానికి ఈ అప్పుల అంశం చాలా కాలంగా వివాదాస్పదమవుతోంది. బీజేపీ సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు… బయటపడే పరిస్థితి వచ్చిందనుకున్నారేమో కానీ..బీజేపీ నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు.