రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. అరుదైన ఇంజనీరింగ్, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ప్రపంచ స్థాయి కట్టడంగా ఎట్టకేలకు గుర్తింపు సాధించింది. చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను ప్రకటించారు. అయితే ఇది అంత తేలికగా రాలేదు. రామప్ప ఆలయానికి హెరిటేజ్ సైట్ హోదా రాకుండా నార్వే లాంటి దేశాలు అడ్డం పడ్డాయి. అయితే భారత్కు పదిహేడు దేశాలు మద్దతు తెలిపాయి. కాకతీయుల కాలంలో 13వ శతాబ్దంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం తెలంగాణ నుంచి . ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం పోటీ పడ్డాయి సాంకేతిక కారణాలతో ఖిలావరంగల్, వేయి స్తంభాల గుడికి తుది జాబితాలో చోటు దక్కలేదు.
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆలయం నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపరై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్ష్యా మంటపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. రామప్ప ఆలయ గోపురానికి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడే ఇటులకను వాడారు. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవు.
ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదు ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. యునెస్కో గుర్తింపు వల్ల ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. యువతకు ఉపాధి అవకాశాలే కాకుండా విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. కట్టడం పర్యవేక్షణ, అభివృద్ధి, పరిరక్షణకు యునెస్కో నిధులు ఇస్తుంది.