తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని అదేపనిగా ఆ నియోజకవర్గానికి వరాల మీద వరాలు ప్రకటిస్తూండటంతో ఇతర నియోజకవర్గాల నేతలకు మండిపోయేలా చేస్తోంది. టీఆర్ఎస్ నేతలు ఎలాగూ నోరెత్తలేరు. కొంత మంది విపక్ష నేతలు కూడా.. మాకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. అయితే.. తమ నియోజకవర్గంలో ఏ పనులూ చేయించలేకపోతున్నామని… ఫీలవుతున్న కొంత మంది మాత్రం నోరు విప్పుతున్నారు. అలాంటివారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.
హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ రూ. రెండువేల కోట్లు కేటాయించారని.. అదే రెండు వేల కోట్లు మునుగోడుకు కూడాకేటాయిస్తే.. తాను ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని ప్రకటించారు. ఉపఎన్నికలు వచ్చిన నియోజకవర్గానికి నిధుల వరదేనని సోషల్ మీడియాలో కామెంట్లు నడుస్తున్నాయి. ఈ సమయంలో.. తాను రాజీనామా చేస్తే వచ్చే ఉపఎన్నిక కోసమైనా. కేసీఆర్ .. తన నియోజకవర్గానికి రూ. రెండు వేల కోట్లు కేటాయిస్తారనేది రాజగోపాల్ రెడ్డి అంచనాగా చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటి నుండి.. తన నియోజకవర్గంలో చిన్న అభివృద్ధి పని కూడా చేయించలేకపోయానని.. రాజగోపాల్ రెడ్డి బాధపడుతున్నారు.
ఇప్పుడు ఎవరూ అడగకపోయినా… కేవలం ఉపఎన్నిక కారణంగానే… హుజూరాబాద్‌కు నిధుల వరద పారుతూండటంతో కోమటిరెడ్డికి అసంతృప్తి కలిగిస్తోంది. అదేసమయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి… నిధుల లేకపోవడం వల్లే.. కేసీఆర్ ఇవ్వకపోవడం వల్లే మునుగోడులో ఏ పనీ చేపట్టలేకపోయినట్లుగా చెప్పుకోవడానికి రాజగోపాల్ రెడ్డికి ఇదో మంచి అవకాశంలా కనిపించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజకీయం తాను ప్రారంభించారు.