అలనాటి నటి.. జయంతి కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. కొంతకాలంగా జయంతి శ్వాస కోస సమస్యతో బాధపడుతున్నారు ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. దక్షిణాదిన అన్ని భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ సరసన నటించి – ఆ తరవాత… క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. 1945 జనవరి 6న బళ్లారిలో జన్మించారు జయంతి. ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. చెల్లాయి పాత్రలకు జయంతి పెట్టింది పేరు. చిత్రసీమకు చెందిన ఏ కార్యక్రమంలో అయినా జయంతి హాజరు తప్పని సరి. ఓసీనియర్ నటీమణిగా తనవైన సలహాలూ, సూచనలు ఇస్తుండేవారామె. జయంతి మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.