బాహుబలి సినిమాతో లాభపడిన వాళ్ల లిస్టులో రామోజీరావు ఒకరు. ఈ సినిమా షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే సాగింది. ఈ సినిమాకి రామోజీరావు తెర వెనుక పెట్టుబడి పెట్టారని, లాభాల్లో ఆయనకు వాటా దక్కిందని అప్పట్లో చెప్పుకున్నారు కూడా. సినిమా అంతా ఫిల్మ్‌సిటీలోనే కాబట్టి, రామోజీరావుకి బాగా గిట్టుబాటు అయ్యింది. అందుకు తగ్గట్టుగానే `ఈనాడు`లో ఈ సినిమాకి భారీ ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టే రామోజీ ఫిల్మ్‌సిటీకి మరోటి దక్కింది. అదే.. `ప్రాజెక్ట్ కె`.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. నాగ అశ్విన్ దర్శకుడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే. కొన్ని సన్నివేశాలు మాత్రం విదేశాల్లో తెరకెక్కిస్తారని టాక్. అంటే దాదాపుగా 90 శాతం షూటింగ్ ఆర్.ఎఫ్.సీ లోనే. అంటే.. రామోజీ ఫిల్మ్‌సిటీకి మరో బాహుబలి దక్కినట్టే. ఈ సినిమాకి సెట్లన్నీ ఫిల్మ్‌సిటీలోనే వేయబోతున్నారు. దాదాపు 50 శాతం సన్నివేశాలు సెట్లోనూ, మిగిలినదంతా బ్లూ మేట్ లోనూ తెరకెక్కించబోతున్నారని టాక్. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె సెట్లోకి అడుగుపెట్టబోతోందని సమాచారం. 2023లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.