ముఖ్యమంత్రుల్ని మార్చడంలోబీజేపీ హైకమండ్ మొహమాటానికి పోవడం లేదు. కొద్ది రోజుల కిందట అసోంలో సిట్టింగ్ సీఎంగా ఉన్న సోనోవాల్కు హ్యాండిచ్చి కొత్త సీఎంను ఎంపిక చేసిన బీజేపీ పెద్దలు.. ఆ తర్వాత ఉత్తరాఖండ్ సీఎంను మూడు నెలల్లో మూడో సారి మార్చడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు కర్ణాటక వంతు వచ్చింది. కొన్ని రోజులుగా యడ్యూరప్ప రాజీనామా చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్లుగా హైకమాండ్ .. రాజీనామా చేయాలన్న సందేశం పంపడంతో ఆయన తన రాజీనామాను గవర్నర్కు సమర్పించాలని నిర్ణయించారు. పదవి చేపట్టి నేటికి ఖచ్చితంగా రెండేళ్లు. ఈ సందర్భంగానే రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. పదవి చేపట్టిన ఈ రెండేళ్లలో ఎన్నోసవాళ్లను ఎదుర్కొన్నానని యడ్యూరప్ప చెప్పుకొచ్చారు.
యడ్యూరప్పకు 78 ఏళ్లు. బీజేపీలో 75 ేళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ ఇవ్వాలన్న రూల్ ఉంది. ఈ కారణంగానే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి పెద్ద నేతలను సైతం పక్కన పెట్టారు. అయితే రెండేళ్ల కిందట.. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో యడ్యూరప్ప కన్నా ప్రభుత్వాన్ని నడపగలిగే నేత మరొకరు అధిష్టానానికి కనిపించలేదు. దీంతో ఆయననే సీఎంగా చేశారు. అయితే పాలనలో ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. చివరికి ఆయనను సాగనంపాలని నిర్ణయించుకున్నారు. ఆయన అసంతృప్తికి గురి కాకుండా.. అనుంగు శిష్యురాలు అయిన శోభా కరంద్లాజేకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు.
ఇప్పుడు కర్ణాటకకు కొత్త సీఎంను ఎంపిక చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే.. ఎవర్ని ముఖ్యమంత్రిగా చేయాలో.. మోడీ, అమిత్ షా నిర్ణయించుకున్న తర్వాతే… యడ్యూరప్పతో రాజీనామా చేయించి ఉంటారు. అయితే ఎవర్ని సీఎం చేయబోతున్నారన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల కేంద్ర కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన.. సదానందగౌడ గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు.. బీఎల్ సంతోష్, ప్రహ్లాద్ జోషి వంటి పేర్లు వినిపిస్తున్నాయి.