విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. వెనక్కి తగ్గుతుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయ పార్టీలన్నీ రాజకీయ కోణంలోనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఉపయోగం ఉన్నప్పుడు స్పందించడం.. తర్వాత సైలెంటయిపోవడం వంటివి చేశాయి. ఫలితంగా కేంద్రం వీటన్నింటినీ లైట్ తీసుకుంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్నలు అడుగుతోంది. ఆ పార్టీ ఎంపీలు ఒకరు తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతున్నారు. అమ్మే విషయంలో వెనక్కి తగ్గబోమని కేంద్రంతో పదే పదే చెప్పిస్తున్నాయి.
కేంద్రం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి న్యాయసలహాదారుల నియామకానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నియామకం పూర్తయిన తర్వాత తుది అమ్మకం ప్రక్రియ ప్రారంభమవుతుంది. వీటిని అడ్డుకోవడానికి ఏపీ అధికార పార్టీగా.. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి చిన్న ప్రయత్నం కూడా జరగడం లేదు. ఒక్క వైసీపీ మాత్రమే కాదు.. ఇతర పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమం వైపు కన్నెత్తి చూడటం లేదు. చూసినా.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మాత్రం రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు.
అయినా.. వారిని పట్టించుకునే వారే కరవయ్యారు. అధికార పార్టీగా ఉన్నందున వారు ఎక్కువగా.. వైసీపీ నేతల్ని నమ్ముకున్నారు. వైసీపీ నేతలు.. పార్లమెంట్లో ప్రశ్నలు వేసి… స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న సమాధానాన్ని కేంద్రంచేత చెప్పిస్తున్నారు. ఇదంతా ఉద్యోగుల్ని మానసికంగా సిద్ధం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా కొంత మంది అభివర్ణిస్తున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే.. ఏదో ఓ ప్రయత్నం చేయాలి కానీ ఇలా వరుసగా ప్రశ్నలు సంధించి… అమ్మడం ఖాయమని చెప్పించడం ఏమిటన్న చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.