తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితిని మెరుగు పరిచేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఆయనకు అన్నాడీఎంకేకు ఏంటి సంబంధం అనే డౌట్ రావొచ్చు. కానీ.. నిజంగానే ఆయన అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో రాజీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం ఆయన వద్ద పన్నీర్ సెల్వం, పళనీ స్వామి పంచాయతీ చేసుకున్నారు. అధికారికంగా సమావేశం కావడానికి వారేమీ అధికారంలో లేరు కాబట్టి.. రాజకీయ పరమైన కార్యక్రమాల కోసమే మోడీతో సమావేశం అయ్యారు. అన్నాడీఎంకేతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంత మాత్రాన.. బీజేపీ హైకమాండే.. తమ పార్టీ హైకమాండ్ అని అనుకోవాల్సిన పని లేదు. కానీ ఈపీఎస్, ఓపీఎస్ అనుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినంత ఘోరంగా ఓటమి ఎదురు కాలేదు. గౌరవప్రదమైన స్థానాలే దక్కాయి. అయితే.. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది. దీంతో అన్నాడీఎంకే పరిస్థితి ఎటూ కాకుండా పోతోందన్న అభిప్రాయం ప్రారంభమయింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అన్నాడీఎంకేలోకి శశికళను తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలన్న సూచనలను… ఇప్పటికే పంపారు. అయితే.. ఆమె వస్తే తమ పరిస్థితి డమ్మీ అవుతుందని ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ అంగీకరించడంలేదు. దీంతో మోడీ వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించినట్లుగా తెలుస్తోంది. రాజకీయాలకు స్వస్థి పలికినట్లు ఎన్నికల ముందు ప్రకటించిన శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని ఇద్దరు నేతలు పట్టుదలగా ఉన్నారు.
అయితే బీజేపీ పెద్దలు మాత్రం.. శశికళ అన్నాడీఎంకేలోకి వస్తే ఆమె వర్గానికి చెందిన ఐదు శాతం ఓటు బ్యాంక్ కలసి వస్తుందని.. స్థానిక సంస్థల ఎన్నికలు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని నచ్చ చెబుతున్నారు. దీనిపై వారిద్దరూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మోడీ చెప్పిన తర్వాత పన్నీర్ సెల్వం మెత్తబడినప్పటికీ.. పళనిస్వామి మాత్రం ఇంకా ఆలోచిస్తున్నారంటున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా తమకు దక్కాల్సిన ఓ రాజ్యసభ ఎంపీ సీటును.. ఆ పార్టీకే వదిలి పెట్టాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే ఏర్పడింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తమిళనాడు బీజేపీ నేత మురుగన్‌కు పదవి ఇచ్చారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. తమిళనాడు నుంచే రాజ్యసభకు పంపాల్సి ఉంది.