తెలంగాణ సర్కార్‌తో ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు వివాదాలున్నాయి. జల వివాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఒకరిపై ఒకరు కోర్టు ధిక్కార పిటిషన్లు వేసుకుంటున్నారు. అయితే.. ఆ వివాదాలు .. జలాల వరకే పరిమితం చేసుకున్నారు. ఇతర విషయాల్లోకి వాటిని చొప్పించుకోవడం లేదు. కొద్ది రోజుల కిందట…ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖ అధికారి కావాలని అనుకున్నారు. ఆయన అనుకున్నదే తక్షణం… తెలంగాణ సర్కార్ ఆయనను గౌరవంగా రిలీజ్ చేసి.. ఏపీకి పంపింది. ఆయన వచ్చి సజ్జల దగ్గర చేరిపోయారు. అలాంటి సౌహార్ద్రిక సంబంధాలను రెండు ప్రభుత్వాల అధినేతలు కొనసాగిస్తున్నారు.
తాజాగా… ఏపీ సర్కార్ తాము ఎంతో ఖర్చు పెట్టి రూపొందించుకున్న సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవడానికి తెలంగాణ సర్కార్‌కు అనుమతి ఇచ్చింది. ఏపీలో నాడు- నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకగా సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించారు. టీసీఎస్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను తాము కూడా వినియోగించుకోవాలని తెలంగాణ సర్కార్ అనుకుంది. వెంటనే ఏపీ సర్కార్‌కు విజ్ఞప్తి చేసింది. ఎన్‌వోసీ ఇవ్వాలని కోరింది. అధికారులు ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా.. మరో క్షణం ఆలోచించకుండా… ఇచ్చేయమని సూచించారు. దీంతోపాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నాడు – నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు నో అబ్జెక్షన్ ఉత్తర్వులిచ్చారు.
ముఖ్యమంత్రుల మధ్య మంచి రాజకీయ స్నేహం ఉంది. ప్రభుత్వాల పరంగా.. ఎలాంటి గొడవలు పడినా…రాజకీయంగా మాత్రం ఇరువురూ సహకరించుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ ఏం అడిగినా.. ఏపీ ప్రభుత్వ అధికారులు.. కాదనడం లేదు.. తెలంగాణ కూడా అంతే. అయితే ఒక్క నీటి విషయంలో మాత్రం ఎవరూ ఎవరి మాట వినడం లేదు. అసలు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడాలనుకోవడం లేదు.