ఫార్ములా చుట్టూ టాలీవుడ్.. టాలీవుడ్ చుట్టూ ఫార్ములా తిరుగుతుంటుంది. ఓ ఫ్యాక్షన్ సినిమా హిట్టయితే.. ఇంకోటి బయల్దేరిపోతోంది. హారర్ సినిమాలన్నీ కట్టకట్టుకుని వస్తాయి. లవ్ స్టోరీలన్నీ ఒకేసారి వరుస కడతాయి. ఇప్పుడు టైమ్ మిషన్ ల ట్రెండ్ మొదలైంది. దర్శకులంతా ఇప్పుడు టైమ్ మిషన్ నేపథ్యంలో కథలు రాసుకుంటున్నారు.
టైమ్ మిషన్ అనగానే గుర్తొచ్చే సినిమా `ఆదిత్య 369`. నందమూరి బాలకృష్ణ – సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా `ఆదిత్య 999` రెడీ అవుతోంది. ఈ చిత్రానికి బాలయ్య కథ అందించడం విశేషం. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. 2023లో ఈ సినిమా పట్టాలెక్కొచ్చు. అన్నీ కుదిరితే బాలయ్యనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి `ప్రాజెక్ట్ కె` అనే నామకరణం చేశారు. ఇదో విచిత్రమైన జోనర్. సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్.. ఇలా రెండు మూడు జోనర్లని మిక్స్ చేశారు. ఇందులో టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా ఉందట. అందుకే ఈ చిత్రానికి స్క్రిప్టు విషయంలో నాగ అశ్విన్ సింగీతం సహాయం కోరాడు. టైమ్ మిషన్ ఎక్కిన హీరో.. భవిష్యత్తులోకి వెళ్లిపోవడమే ఈ కథ నేపథ్యం అని సమాచారం.
వీళ్లతో పాటు శర్వానంద్ కూడా టైమ్ మిషన్ ఎక్కేస్తున్నాడు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు శర్వా ఓకే చెప్పాడు. ఇది టైమ్ మిషన్ కథే. టైమ్ మిషన్ లో శర్వా… తన బాల్యంలోకి వెళ్లడమే ఈ కథా నేపథ్యం. 1990లోని అందమైన జ్ఞాపకాల్ని నెమరేసుకోవడం ఈ కథలోని పాయింట్. ఈ సినిమాలో టైమ్ మిషన్ లేవీ ఉండవు గానీ.. అలాంటి విచిత్రమైన సెటప్ ఒకటి డిజైన్ చేస్తున్నారు. ఓ రకంగా ఇది ఫాంటసీ సినిమా అనుకోవాలి. మొత్తానికి కాలాన్ని వెనక్కి తిప్పి గతంలోకి…. ముందుకు జరిపి భవిష్యత్తులోకి వెళ్లడానికి దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. నిజంగా ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.