ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని కేంద్రం పార్లమెంట్లో లెక్కలు చెప్పింది. రూ. నాలుగు వేల కోట్లకుపైగా ఎక్కువగా తెచ్చుకుందని.. ఇప్పటి వరకూ వచ్చిన బడ్జెట్ లెక్కల ప్రకారం తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే ఏపీ సర్కార్ అప్పులపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. చట్ట విరుద్ధమైన పద్దతుల్లో … లెక్కల్లోకి రాకుండా అప్పులు చేస్తోందని.. అదీ కూడా.. ఇరవై ఏళ్ల పాటు ఆదాయాన్ని తాకట్టు పెడుతోందన్న విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. అయితే కేంద్రం మాత్రం ఇప్పటి వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా.. ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఆర్థిక నిర్వహణపై ఆరా తీయలేదు. కనీసం ఏం చేస్తున్నారో కూడా ప రిశీలించలేదు.
ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం.. తీసుకోవాల్సిన రుణం కంటే ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. అలా తీసుకోకుండా ఉండటానికి చట్టం తీసుకు వచ్చారు. ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఆ పరిమితికి మించి ఎక్కడా అప్పులు ఆయా ప్రభుత్వాలకు ఇవ్వకుండా… దక్కకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. కానీ అలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ కారణాలతో… చూసీ చూడనట్లుగా ఉన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రుణాలు ఇవ్వొద్దని.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించించలేదు. అలాగే.. ఆర్బీఐ కూడా.. ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు బాండ్లు వేలం వేయడానికి చాన్స్ ఇచ్చారు.
ప్రస్తుతం .. అధికారికంగా బడ్జెట్ లెక్కల్లోనే రూ. యాభై వేల కోట్ల లోటులో ఏపీ ఉందని కేంద్రం చెబుతోంది. కానీ లెక్కల్లోకి రాని అప్పులు.. ఇతర వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఉండదు. రేపటి రోజున రాష్ట్రం దివాలా తీసి.. ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని దారుణ స్థితికి వెళ్తే.. కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఎన్నుకున్న పాలకులే ఇలా చేశారని చెప్పడానికి .. ఎదురుదాడి చేయడానికి కేంద్రం ప్రయత్నించవచ్చు. కానీ నిబంధనలను పక్కాగా అమలు చేసి.. రాజ్యాంగ పరంగా పాలన జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. ప్రజాస్వామ్య వాదులు గుర్తు చేస్తున్నారు.