తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మంగళవారం ఆయన కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని.. పరిశీలించడానికి అక్కడికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఆయనపై కొంత మంది రాళ్ల దాడి చేశారు. దీనికి నిరసనగా ఆయన కారులోనే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అర్థరాత్రి వరకూ ఆయన కారులోనే నిరసన తెలిపారు. చివరికి తెల్లవారుజామున కారు అద్దాలు తొలగించి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నంతో పాటు , అట్రాసిటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కావడంతో రిమాండ్‌కు తరలించడం ఖాయంగా కనిపిస్తోంది.
దేవినేని ఉమపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆయన ఎవరిపై హత్యాయత్నం చేశారో.. ఎవరిపైన కులపరమైన వ్యాఖ్యలు చేశారో చూపించాలని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం దేవినేని ఉమను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్న లక్ష్యంతోనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి అందరూ .. ఈ అంశంపై స్పందించారు. పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. మైలవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొండపల్లి అడవుల్లో కొంత కాలం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించారు. గతంలో అటవీ అధికారులు దాడులు చేసి.. మైనింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. కానీ ఎవర్నీ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మైనింగ్ వాహనాలను కూడా విడిచిపెట్టారు.
ఆ తర్వాత కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దేవినేని ఉమ పరిశీలనకు వెళ్లారు. వెళ్లి వచ్చే సమయంలో.. ఆయనపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. దేవినేని ఉమ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. అలా చేస్తే ఆయనపై దాడులకు వెనుకాడబోమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించడం.. మరింత వివాదానికి దారి తీసింది. దేవినేని ఉమను కొన్నాళ్లైనా జైల్లో పెట్టాలని వైసీపీ పెద్దల లక్ష్యమని.. వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన కేసుతో.. అ అవకాశం వారికి లభించింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం… జైలుకు పంపాలన్న ఉద్దేశంతో కోర్టు సమయం ముగిసేవరకూ.. స్టేషన్‌లోనే ఉంచడం.. వంటి వాటితో.. ఆయనను జైలుకు తరలించడం ఖాయంగా కనిపిస్తోంది.