ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఓడించడానికి అందరూ ఏకమవ్వాల్సిన అవసరాన్ని మమతా బెనర్జీ ఎట్టకేలకు గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం ఆమె.. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోరాటం చేసే విషయంలో రిజర్వేషన్లను పాటిస్తున్నారు. అవసరం అయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారు. దీంతో విపక్షాల మధ్య ఐక్యత లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ తర్వాత ఆమె.. మాటల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. బీజేపీపై పోరాడేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ సాయం చేయాలనుకుంటున్నాను కానీ నాయకత్వం వహించాలనుకోవడం లేదని ప్రకటించారు.
ఎవరు నేతృత్వం వహించినా నాకేమీ అభ్యంతరం లేదు. ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు నిర్ణయిస్తామన్నారు. అయితే తానేమ పట్టుబట్టనని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. అందరి ఆమోదంతోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి కాబట్టి.. తనకు అభ్యంతరం లేదని తెలిపారు. శరద్ పవార్‌తో పాటు మరికొంత మంది ప్రాంతీయ పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించి.. వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా మార్చే అవకాశం ఉంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నారు. విపక్షాలకు.. కూడా.. కాంగ్రెస్ తో కలిసి పోరాడితేనే ప్రయోజనం ఉంటుందని… ధర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదని వివరిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అయితే..తాను కాంగ్రెస్ కోసం పని చేసేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ తురణంలో మమతా బెనర్జీలో మార్పు.. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.