ఆ దంపతుల మధ్య ఇరవై ఏళ్లుగా వివాదాలున్నాయి. ఎదిగొచ్చిన కొడుకున్నాడు. కానీ కింది కోర్టు.. పైకోర్టు.. హైకోర్టు.. సుప్రీంకోర్టు .. ఇలా వారి మధ్య కేసు పైకి వస్తూనే ఉంది. రాజీ కోసం అన్ని స్థాయిల కోర్టుల్లో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. చివరికి సీజేఐ బెంచ్ ముందుకు వచ్చింది. వారు తెలుగువారు కావడం.. వారి సమస్యలు ఇంగ్లిష్‌లో చెప్పుకోవడానికి ఇబ్బంది పడటంతో తెలుగులోనే మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం చూపించారు. ఇరవై ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగినా కలిసేందుకు అంగీకరించని ఆ జంట.. ఇప్పుడు.. కలిసే ఉంటామని అంగీకరించారు. సుప్రీంకోర్టులో జరిగిన ఈ కేసు విచారణ.. హాట్ టాపిక్ అయింది.
గుంటూరుకు చెందిన ఓ జంట చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. భర్తపై ఆమె వరకట్న కేసు పెట్టింది. ఇప్పటివరకూ తేలలేదు. రెండు వర్గాలూ వెనక్కి తగ్గలేదు. 2013లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ పరిష్కారం చేయాలని మళ్లీ హైకోర్టుకు పంపింది. కానీ అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్టుకు చేరింది. ఆ కేసు విచారణ సీజైఐ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ ఉన్న బెంచ్ మీద మీదకు వచ్చింది. ఈ కేసులో కక్షిదారు అయిన మహిళ వాదనలు వినిపించాల్సి వచ్చింది. అయితే ఆమెకు భాషా సమస్య వచ్చింది. ఇంగ్లిష్‌లో వాదనలు వినిపించడానికి ఇబ్బంది పడింది. ఆమె ఇబ్బందిని గమనించిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులోనే .. చెప్పాలని కోరారు.
జస్టిస్ ఎన్వీ రమణ.. ఆమె తెలుగులో వినిపిస్తున్న వాదనలను.. ఇంగ్లిష్‌లో జస్టిస్ సూర్యకాంత్‌కు స్వయంగా వివరించారు. దీంతో ఆమె ఎక్కడా భాషా సమస్యతో ఇబ్బంది లేకుండా.. తాను చెప్పాలనుకున్నదంతా చెప్పారు. తర్వాత ఆమె భర్త తరపు న్యాయవాది కూడా వాదించారు. ఆమె చేసిన ఫిర్యాదు వల్ల సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే.. ఇద్దరూ ఇబ్బంది పడతారని.. కుటుంబ పరమైనసమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. తర్వాత ఇరువురూ కలిసి ఉంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే.. మాట వరుసకు కాదని..పట్టువిడుపులు ఉండాలని… జస్టిస్ ఎన్వీరమణ సూచించారు. ఫ్యామిలీ వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్ ప్రక్రియను చాలా కాలంగా పోలీసులు అమలు చేస్తున్నారు. అయితే చాలా వరకు అక్కడ పరిష్కారం కావడం లేదు.