చిరంజీవి దృష్టి ఇప్పుడు మల్టీస్టారర్లపై పడినట్టు ఉంది. `ఆచార్య` ఓరకంగా మల్టీస్టారర్ సినిమానే. ఇందులో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. `లూసీఫర్` కూడా మల్టీస్టారరే. ఇందులో మరో హీరో పాత్రకూ ఛాన్సుంది. ఆ పాత్ర ని ఎవరితో చేయించాలన్న విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పుడు బాబి దర్శకత్వం వహించే సినిమా కూడా మల్టీస్టారరే అని సమాచారం అందుతోంది.
బాబి కథలో చిరు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. దాంతో పాటుగా మరో హీరోకీ ఈ కథలో అవకాశం ఉంది. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకోవాలి? అనే విషయంలో చిరు – బాబి మధ్య మంతనాలు జరుగుతున్నాయి. బాబి ఇప్పటికే రెండు మూడు ఆప్షన్లని చిరు ముందు ఉంచాడు. అందులో ఒకరిని చిరు ఎంపిక చేస్తారని సమాచారం. `లూసీఫర్` రీమేక్ తో పాటుగా బాబి సినిమాని సమాంతరంగా పట్టాలెక్కించి, రెండు సినిమాల్నీ దాదాపుగా ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నారు. లూసీఫర్ రీమేక్ తో పాటుగా… బాబి కథ కూడా పూర్తి స్థాయి స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి… రెండూ ఒకేసారి మొదలెట్టడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇవి రెండూ అయ్యాకే.. మెహర్ రమేష్ సినిమా మొదలవుతుంది.