తూర్పుగోదావరి. విశాఖ మన్యం ప్రాంతాల్లో కొంత కాలంగా బాక్సైట్ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వి తీసుకెళ్తున్నారని దీని కోసం రక్షిత అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా వేశారని విపక్ష నేతలు ఆరోపించారు. వారు వెళ్లి అడవిలో పరిశీలన చేసి వచ్చే సమయంలో పోలీసులు అరెస్టులు కూడా చేశారు. ఇప్పుడీ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ దాఖలు కావడంతో… విచారణ జరిపిన ఎన్జీటీ.. కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీని నిమయమించింది. మైనింగ్ పేరుతో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా ఎన్జీటీ నిర్ధారరణకు వచ్చింది.
అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
అయితే కమిటీ ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయి కానీ అమలు చేయాల్సింది ఏపీ ప్రభుత్వం. ఎన్జీటీని ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటున్న సూచనలు లేవు. ఇటీవల.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో తనిఖీలు చేయాలని ఆదేశించినా ఏపీ సర్కార్ సహకరించలేదు. ఇప్పుడు మైనింగ్ విషయంలోనూ.. ఏపీ అధికార పార్టీకి చెందిన వారిపైనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈఆదేశాలను ఆయినా ప్రభుత్వం పాటిస్తుందో లేదో వేచి చూడాలి..!