పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితిని చక్క బెట్టడానికి ఇప్పటి వరకూ సమయం కేటాయించిన కాంగ్రెస్ హైకమాండ్… ఇప్పుడు పార్టీ అవసాన దశలో ఉన్న రాష్ట్రాలపైనా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితిపై చర్చలు జరిపి.. చివరికి అక్కడ పీసీసీ చీఫ్‌ను మార్చాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్‌గా శైలజానాథ్ ఉన్నారు. ఆయన ఎక్కడా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లుగా కనిపించడం లేదు. ఎప్పుడో ఓ ప్రెస్‌మీట్ పెట్టి.. మ మ అనిపిస్తూ ఉంటారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీలో ఆయన అసలు కదలిక లేకుండా చేశారు. అంతకు ముందు పీసీసీ చీఫ్‌గా రఘువీరా ఉండేవారు.
ఆయన రాజకీయాల కంటే.. ముందుగా.. తన ఊళ్లో ఆలయాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టారు. ఇటీవలే ఆ ఆలయాన్ని ప్రారంభించారు. ఇక ముందైనా ఆయన రాజకీయాన్ని యాక్టివ్‌గా చేస్తారో లేదో చెప్పడం కష్టం. అందుకే.. కొత్త పీసీసీ చీఫ్‌గా ఓ రేంజ్ ఉన్న నేతను పెడితే… కాస్త హైప్ వస్తుందని అంచనా వేస్తున్నారు. జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. ఫెయిలయి.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో ఉన్న టాల్ లీడర్. ఆయనను పెడితే ఎలా ఉంటుందా.. అని మేథోమథనం చేస్తోంది హైకమాండ్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ పోస్ట్ తీసుకోవాలా వద్దా అన్నదానిపై కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది . కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు.
ఢిల్లీ స్థాయిలో పార్టీకి తెర వెనుక సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనను పీసీసీ చీఫ్‌గా పంపితే.. కదలిక వస్తుందని.. పార్టీ క్యాడర్ కొంత మరే వైసీపీ నుంచి వెనక్కి వస్తుందన్న అంచనాలో హైకమాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన అంగీకరిస్తే.. ఏపీసీసీకి కూడా కాస్త యాక్టివ్‌గా ఉండేనేత దొరుకుతారు. కష్టపడితే బలపడే అవకాశం కూడా ఉంటుంది.