మీకే భయం వద్దు.. మేమున్నాం..! … అంటూ విజయసాయిరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. కానీ ఆ భరోసా భరోసాలాగానే ఉండిపోయింది. వరుసగా సోషల్ మీడియా కార్యకర్తల్ని సీబీఐ అరెస్ట్ చేస్తూపోతోంది. కానీ అరెస్టయిన వారికి పార్టీ పరంగా న్యాయ సాయం కూడా అందడం లేదు. దీంతో లింగారెడ్డి అనే వ్యక్తి రెండో సారి జైలుకు పోవాల్సి వచ్చింది. బెయిల్ షరతుల ఉల్లంఘన కారణంగా జైలుకుపోవడంతో ఆయనకు మళ్లీ బెయిల్ వస్తుందో రావడం చెప్పడం కష్టం. అదే సమయంలో ఇతరుల అరెస్టులను ప్రారంభించారు. మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఇరవై మందికిపైగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మరింత అలజడి ప్రారంభమైంది. హైకోర్టు నోటీసులు ఇచ్చిన వారందర్నీ సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని.. వారిలో అత్యధికుల్ని అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ.. వారు అండగా ఉండే పరిస్థితి లేదు. వారు న్యాయవ్యవస్థపై చేసిన కామెంట్లను సమర్థించి.. వారికి న్యాయసాయం అందిస్తే.. వారి వెనుక తాము ఉన్నామన్న భావన పెరిగిపోతుందని.. అది మంచిది కాదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పైకి మాత్రం ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు కానీ నిజంగా మాత్రం.. వారికి సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ అంశంపై అవగాహన వచ్చింది. అందుకే ఎక్కువ మంది తమ అకౌంట్లను డిలీట్ చేసుకుంటున్నారు.
యాక్టివ్ గా ఉన్న కొంత మంది.. వివాదాస్పద పోస్టుల పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో గతంలో న్యాయవ్యవస్థపైనా చేసిన వ్యాఖ్యల పోస్టులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో ఇతర పార్టీల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ అండగా ఉంటుందని ఇప్పటి వరకూ అనుకున్నాం కానీ.. ఇప్పుడుపావులాగా వాడుకుందన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు. సీబీఐ అరెస్టులు జోరందుకునే కొద్దీ… వైసీపీ సోషల్ మీడియా మరింతగా సంక్షోభంలో కూరుకుపోతుందని కొంత మంది అంచనా వేస్తున్నారు.