డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీ వెళ్లారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు మరికొంత మంది కేంద్రమంత్రుల్ని కలిశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలో ఉండగా రాష్ట్ర సమస్యల కోసం అంటూ కోన రఘుపతి కేంద్రమంత్రుల్ని కలవడం… వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక వేళ అలా కలవాలనుకుంటే ఎంపీలందరూ వెళ్లి కలవొచ్చు కానీ అసలు కోన రఘుపతికి ఎంటి సంబంధం అనే చర్చ కూడా జరుగుతోంది. కోన రఘుపతి కలిసినట్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పీఆర్ టీం ఫోటో రిలీజ్ చేసింది కాబట్టి బయటకు తెలిసింది.. లేకపోతే తెలిసేది కాదు.
కానీ ఒక్క కోన రఘుపతి మాత్రమే కాదని… పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు .. ఇతర కీలక నేతలు బీజేపీ పెద్దల్ని కలిసి వెళ్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ .. ఢిల్లీ పర్యటనకు వస్తున్నట్లుగా మీడియాకు కూడా తెలియదు. కానీ ఆయన తరచూ ఢిల్లీకి వస్తున్నారని ఓ స్టార్ హోటల్లో బస చేసి కలవాల్సిన వారిని కలిసి వెళ్తున్నారని చెబుతున్నారు. ఇది వైసీపీలో బహిరంగ రహస్యం అయింది.కానీ ఎవరూ నోరు మెదపడం లేదు. మరికొంత మంది కూడా బీజేపీ నేతలో రెగ్యులర్ టచ్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు.
ఈ అంశంపై వైసీపీ హైకమాండ్ .. దృష్టి సారించిందో లేదో కానీ.. బయట స్పెక్యులేషన్ పెరిగిపోవడానికి కారణం అవుతోంది. గతంలో తమిళనాడులో బీజేపీ చేసిన రాజకీయాలు గుర్తున్న వారికి.. వైసీపీ హైకమాండ్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సూచనలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ అనుమతి లేకుండా.. ఎవరూ బీజేపీ పెద్దల్ని కలవడానికి లేదని.. ఏదైనా అవసరం మేరకు కలిస్తే.. పార్టీ ఎంపీలతో పాటే వెళ్లి కలవాలని మొదట్లోనే వైసీపీ హైకమాండ్ నిర్దేశించింది. కానీ ఇప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకుంటున్నట్లుగా లేరు.