ఉగ్రవాదులపై నిఘాకు వాడాల్సిన సాఫ్ట్‌వేర్‌ను రాజకీయ ప్రత్యర్థుల వేటకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ ఆ సేవల్ని కొన్ని ప్రభుత్వాలకు నిలిపి వేసినట్లుగా ప్రకటించింది. ఈ పెగాసస్ వ్యవహారం ఒక్క ఇండియాలో మాత్రమే కాదు.. ఇతర దేశాల్లోనూ కలకలం రేపుతోంది. అయితే ఇంతకు ముదే కొన్ని దేశాల ప్రభుత్వాలకు ఆ సాఫ్ట్వేర్ అమ్మకాన్ని నిలిపివేశారు. కానీ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్న అన్ని దేశాలకూ సేవలు నిలిపివేసినట్లుగా ఆ కంపెనీ చెప్పుకుంది. ఏ ఏ దేశాలు అన్నది చెప్పలేదు కానీ.. పెగసస్ వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో… ఇండియాలో కూడా ఆ సంస్థ తన సేవల్ని నిలిపివేసినట్లుగా భావిస్తున్నారు.
అసలు పెగసస్ సాఫ్ట్‌వేర్‌ని ఇండియాలో వినియోగిస్తున్నామో లేదో ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అటు అంగీకరించడం లేదు. ఇటు ఖండించడం లేదు. దీంతో ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది. మరో వైపు… ఇండియాలోని అనేక మంది ప్రముఖులపై పెగాసస్ సాఫ్ట్వేర్ నిఘా జరిగిందని సాంకేతిక ఆధారాలు బయటకు వస్తూండటంతో కలకలం రేగుతోంది. సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వాలకే అమ్ముతామని ఇజ్రాయెల్ సంస్థ చెబుతోంది. మరి ప్రభుత్వం కొన్నామనో.. కొనలేదనో చెప్పడం లేదు. ప్రైవేటు వ్యక్తుల చేతికి సాఫ్ట్ వేర్ చిక్కితే అంత కంటే పెద్ద ఉపద్రవం ఉండదు.
ఇప్పుడు .. రాజకీయ అవసరాల కోసం ఆ నిఘా సాఫ్ట్‌వేర్‌ను వాడుకున్నట్లుగా భావిస్తూ… సేవల్ని ఇజ్రాయెల్ కంపెనీ నిలిపివేస్తే .. కేంద్రం.. తాము ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడటం లేదని బహిరంగంగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. అయితే .. ఇజ్రాయెల్ సంస్థకు భారత్ అతి పెద్ద ఆదాయ వనరుగా ఉంది. ఎక్కువగా ఉపయోగించుకుంటున్న దేశాల్లో భారత్ ఉంటుంది. గత.. రెండు, మూడేళ్లలో దాదాపుగా వెయ్యి కోట్లు ఆ సంస్థకు చెల్లించినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇండియాలో ఆ సంస్థ సేవలు నిలిపివేస్తుందా.. అన్నది మరికొంత మంది సందేహం. అయితే నిఘా కొనసాగుతుందా.. ఆగిపోయిందా అనేది చాలా మంది తేల్చుకోలేకపోతున్నారు.