ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ జీఎస్టీ కట్టవద్దని మహారాష్ట్ర వ్యాపారులకు సూచించడం.. దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. ప్రహ్లాద్ మోదీ.. ప్రస్తుతానికి వ్యాపారుల సంఘాల్లో కీలకంగా పని చేస్తున్నారు. వాటి తరపున ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఓ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ జీఎస్టీపై చర్చ జరిగింది. దీంతో ప్రహ్లాద్ మోడీ ఆవేశపడ్డారు. ” మోడీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మన సమస్యలు వినాలి..మనమేమీ బానిసలం కాదు” అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. మనం అంటే ఆయన ఉద్దేశంలో వ్యాపారులన్నమాట. మోడీ తమ్ముడిగా కాకుండా… వ్యాపారవేత్త మోడీగా ఆయన మాట్లాడారు.
“జీఎస్టీ చెల్లించబోం” అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని ఆయన వ్యాపారులకు సూచించారు. వ్యాపారులను కేంద్ర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదనేది ప్రహ్లాద్ మోడీ అభిప్రాయం. జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా చేయాలని.. ప్రధాని మోడీ సహా.. యంత్రాంగం అంతా ప్రచారం చేస్తూ ఉంటుంది. తాము ఎంతో సరళమైన పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టామని చెబుతూంటారు. కానీ స్వయంగా వ్యాపారవేత్త అయిన ప్రధాని మోడీ సోదరుడికి మాత్రం.. ఈ జీఎస్టీ లెక్కలు అర్థం కాలేదు. అవి భారంగా ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
జీఎస్టీ కట్టకపోతే.. అధికారులు ఊరుకోరు. వెంటనే కేసు బుక్ చేస్తారు. కావాలంటే సీబీఐని రంగంలోకి దింపుతారు. తర్వాత వ్యాపారసంస్థల్ని మూసివేయిస్తారు. ఇదంతా జరిగే ప్రక్రియ. మరి మోడీ సోదరుడు మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఉందని అంతలా ఆవేశపడ్డారో లేక నిజంగానే.. వ్యాపారవేత్తగా ప్రకటన చేశారో క్లారిటీ లేదు. ఆయన మోడీ సోదరుడు.. తమ వ్యాపారుల సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ ఎందుకో వ్యాపారుల్ని రెచ్చగొట్టేందుకే ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.