పాదయాత్ర చేసి తెలంగాణ బీజేపీలో తిరుగులేని నేతగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బండి సంజయ్కు కిషన్ రెడ్డి బ్రేకేశారు. ఆయన పాదయాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వడం లేదు. మామూలుగా అయితే ఈ నెల 9వ తేదీ నుంచి… పాదయాత్ర ప్రారంభం కావాలి. దీని కోసం పాతిక కమిటీల వరకూ నియమించారు. పాతబస్తీ భాగ్య లక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ … బండి సంజయ్కు అనేక సమస్యలు చుట్టు ముడుతున్నాయి. బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇంత వరకూ ఆ అనుమతి మాటే రాలేదు.
ఇటీవల సహాయమంత్రి నుంచి కేబినెట్ మంత్రికి ప్రమోషన్ పొందిన కిషన్ రెడ్డి ప్రమేయం లేకుండా తెలంగాణ బీజేపీలో ఎలాంటి నిర్ణయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. తాను కాకుండా మరొకరు ఫోకస్ అయ్యేలా కిషన్ రెడ్డి చేసుకోరు. అందుకే.. బండి సంజయ్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతి రాకుండా చేయడమే కాకుండా.. స్వయంగా తానే.. పాదయాత్ర తరహా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్రమంత్రులకు బీజేపీ హైకమాండ్ పార్టీని బలపరిచే బాధ్యతలు ఇస్తుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల బాధ్యతలను బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డికి ఇచ్చారు.
బండి సంజయ్ .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనకు అనూహ్యంగా ఇమేజ్ ఏర్పడింది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో కావొచ్చు.. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో లభించిన విజయాల ఉత్సాహం కావొచ్చు కానీ.. అనేక మంది బండి సంజయ్ నాయకత్వాన్ని బలపరిచారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. ఎక్కువ మంది కిషన్ రెడ్డి వైపు చేరడం ప్రారంభించారు. గతంలో ఉన్న బలంగా ప్రస్తుతం బండి సంజయ్ లేరు. కిషన్ రెడ్డి హవా నడుస్తోంది. దీంతో సంజయ్ పాదయాత్ర.. ప్రకటనకే పరిమితమన్న చర్చ బీజేపీలో ప్రారంభమైంది.