ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. “ఏపీ స్టేట్‌డెలవప్‌మెంట్ కార్పొరేషన్” పేరుతో చేసిన అప్పుల వ్యవహారం రాజ్యాంగ ఉల్లంఘన అని వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా కేంద్రం …ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. “ఏపీఎస్డీసీ” అప్పులపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. వీటిని పరిశీలించిన కేంద్రం అప్పులు చేసిన వైనం చూసిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఎపీఎస్డీసీ కార్పొరేషన్ ఏర్పాటు రాజ్యాంగంలోని 293 (3) అధికరణకు విరుద్ధమని.. ఎలా ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అదే సమయంలో కార్పొరేషన్‌కు పన్నుల ఆదాయం మళ్లింపు కూడా రాజ్యాంగంలోని 266(1) అధికరణను ధిక్కరించినట్లుగా తేలినట్లుగా వివరణ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2020లో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇందు కోసం అసెంబ్లీలో చట్టంచేశారు. ఆ కార్పొరేషన్ రూ 21,500 కోట్ల రుణ సమీకరణకు అయిదు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంది.
వాటిని సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంది. అయితే ఆ రుణాల గురించి ఎక్కడా చెప్పలేదు. అసెంబ్లీకి చెప్పలేదు. దీంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్.. వాటికి సంబంధించిన పత్రాలను బయట పెట్టారు. అప్పటి నుండి రాజకీయంగా సంచలనం అయింది. గ్యారంటీ ఇవ్వలేదని ఆర్థిక మంత్రి బుగ్గన వాదించారు. కానీ ఇచ్చారని పయ్యావుల లేఖ బయట పెట్టారు. ఏపీఎస్డీసీకి రుణం కోసం మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించడాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా భావిస్తున్నారు. దీని కోసం ఎస్క్రో ఖాతాలు ప్రారంభించారు. మామూలుగా అయితే పన్నుల అదాయం.. కన్సాలిడేటెడ్‌ఫండ్‌కు చేరాలి. కానీ అలా చేరకుండా నేరుగా కార్పొరేషన్‌కు అక్కడ్నుంచి బ్యాంకులకు తరలిస్తున్నారు.
అంటే వచ్చే ఆదాయం అంతా అప్పుల కిందే జమ చేస్తున్నారు. అంటే.. ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారన్నమాట. ఇది రాజ్యాంగ విరుద్ధమని రిటైర్డ్ ఐఏస్లు ఐవైఆర్ కృష్ణారావు, పీవీరమేష్ వంటి వారు గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే అంశంపై కేంద్రం లేఖ పంపింది. ఈ మొత్తం లేఖపై ఏపీ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాంకులు కూడా ఆయా కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తాయి.