‘పులొచ్చింది… మేక చచ్చింది’ – అల వైకుంఠపురములో… ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఆ పులి – మేక ఆటని అల్లు అర్జున్ మరోసారి గుర్తు చేయబోతున్నాడు. `పుష్ష` సినిమాతో. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని తొలి గీతం ఈనెల 13న విడుదల కానుంది. 5 భాషల్లో ఈ పాటని ఒకేసారి విడుదల చేయబోతున్నారు. `దాక్కో దాక్కో మేక – పులొచ్చి కొరుకుద్ది పీక` అంటూ సాగే పాట ఇది. ఇందులో `పుష్ష` క్యారెక్టరైజేషన్ ని చూపించబోతున్నాడు సుకుమార్. ఈ పాటతో `పుష్ష` ప్రమోషన్లకు సైతం శ్రీకారం చుట్టినట్టే. ఇది వరకు పుష్ష నుంచి ఓ టీజర్ వచ్చింది. యూ ట్యూబ్ లో ఆ టీజర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. ఇప్పుడు పాటలూ వదలబోతున్నారు. సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ లది విజయవంతమైన జోడీ. ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ గీతాలొచ్చాయి. మరి వాటి జాబితాలో ఈ పాట ఎక్కడ ఉంటుందో చూడాలి.