తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం తన చిత్తశుద్ధిని నిరూపించకునే పనిలో బిజీగా ఉన్నారు. ఓట్ల కోసం ఆయన ఎన్నెన్నో చెబుతూ ఉంటారని కానీ ఆయన వాస్తవానికి ఏమీ చేయరని హుజూరాబాద్‌లో అదే పనిగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. దానికి సాక్ష్యంగా హుజూర్ నగర్, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలను చూపిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రకటించిన వరద సాయం చూపిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను చూపిస్తున్నారు. అలాగే ఉద్యోగ ఖాళీల భర్తీని చూపిస్తున్నారు. రాను రాను ఈ ప్రచారం పెరిగిపోతూండటం… నిజంగానే తాము ఇచ్చిన హామీలన్నీ పెండింగ్‌లో ఉండటంతో సీఎం కేసీఆర్ ఆ ముద్ర చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.
నిన్నటికి నిన్న రుణమాపీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అనుకున్న ఆయన… తాజాగా … ఇటీవల గెల్చిన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ బహిరంగసభ పెట్టి… నియోజకవర్గానికి రూ. 150 కోట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో.. గెల్చిన తర్వాత తాను మళ్లీ వస్తానని … పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. ఆ ప్రకారం.. చాలా రోజుల తర్వాత కేసీఆర్ నాగార్జున సాగర్‌కు వచ్చి … వరాలు ప్రకటించారు. సాగర్ నియోజకవర్గానికి రూ. 150 కోట్లు మాత్రమే కాకుండా.. హాలియా, నందికొండకు కూడా చెరో పదిహేను కోట్లు ప్రకటించారు. ఈ సభలోనూ.. తమ హామీల గురించి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ముఖ్యంగా దళిత బంధు పథకం గురించి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించారు. ఆరు నూరైనా అమలు చేస్తామన్నారు. దళిత జాతిని దేశానికి ఆదర్శంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇక సాగర్‌లో సభ పెట్టారు కాబట్టి కృష్ణా జలాల అంశంపైనా మాట్లాడారు. తెలంగాణ వాటాను తీసుకుని రెండు పంటలు పండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సర్కార్ దాదాగిరి చేస్తోందని విమర్శించారు. పొరుగు రాష్ట్రంపై రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే.. తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని ప్రజల్ని నమ్మించడానికే కేసీఆర్ ఎక్కువ తంటాలు పడుతున్నారని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.