అమరావతికి భూములిచ్చిన రాజధాని దళిత రైతులు అనుకున్నంత అవుతోంది. అసైన్డ్ భూముల పేరుతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని.. సెంట్ చొప్పున పంపిణీ చేసిన ప్రభుత్వం.. అమరావతిలో దళిత రైతుల వద్ద మాత్రం తీసుకోలేకపోయింది. దీనికి కారణం.. అసైన్డ్ భూములయినప్పటికీ.. ఇతర పట్టా భూముల్లాగే అన్ని హక్కులు దళిత రైతులకు కల్పిస్తూ.. అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే. కొంత కాలంగా దళితుల భూముల కేంద్రంగా వివాదం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… ఎవరూ ఫిర్యాదు చేయకుండానే… భూములు పరాధీనం అయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది.
అయితే రాజధాని దళిత రైతులు మాత్రం తమ భూమి తమ దగ్గరే ఉందని.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు.. ఇష్ట పూర్వకంగానే ఇతరులకు అమ్ముకున్నామని అయితే.. ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కూడా తమ పేరుపైనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూండగానే.. అస్సైన్డ్ రైతులు కొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు. మీకు నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో 15 రోజుల్లోగా చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు. అసైన్డ్ రైతుల్లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీరిలో ఓ కేటగిరీ కింద ఉన్న రైతులకు ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు.
ఒకరి తర్వాత ఒకరు.. మొత్తంగా దళిత రైతులందరికీ ఈ నోటీసులు జారీ చేస్తారని.. వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ నేతల వ్యూహం దీని కోసమే నడుస్తోందని.. ఫైనల్గా అమలు చేస్తున్నారని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. దళితుల భూములపై కన్నేసి.. వారి కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తూ… మొత్తం అమరావతిపై కుట్ర చేశారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు మరింత ముదిరే అవకాశం ఉంది. రాజకీయ రచ్చ అయ్యే అవకాశం కనిపిస్తోంది.