ఆంధ్రా యూనివర్శిటీలో సమయం సందర్భం చూసుకోకుండా వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్తోత్రాలు చదివి వినిపించడానికి ఉత్సాహపడే వీసీ ప్రసాదరెడ్డి వాయిస్‌కు మరో గొప్ప “ఆచార్య” జత చేరారు. ఆమే తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి. ఆమెను ఆంధ్రా యూనివర్శిటీలో గౌరవ ఆచార్యునిగా నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాలు హంగామా మధ్య జరిగిన వేడుకలో అందించారు. దీంతో ఆంధ్రా యూనివర్శిటీ ఫ్యాకల్టీలో మరో గొప్ప “ఆచార్య” చేరినట్లయింది.
అయితే ఆమె ఎ సబ్జెక్టుకు ఆచార్యునిగా వ్యవహరిస్తారో.. విద్యార్థులకు ఏం నేర్పుతారో స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె విద్యార్హతలు ఏమిటో కూడా స్పష్టత లేదు. తెలుగు లిటరేచర్‌లో 2000లో తెలుగు యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ పొందారు . అంతకు మించి వివరాలు లేవు. కానీ ఆమె హార్మోనియం వాయించడంలో గొప్ప ప్రసిద్ధి పొందారని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి. జీవిత చరిత్ర రాసేందుకు ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. ఈ కారణంగా ఆమె మంచి పరిజ్ఞానం ఉందని జనం భావిస్తూ ఉంటారు. తెలుగు అకాడెమీ పదవిని రాజకీయంగా భర్తీ చేస్తారు ఇవ్వాలనుకుంటే చదువు రానివారికైనా ఇస్తారు.. అది ప్రభుత్వ ఇష్టం.. కానీ విద్యార్థులకు చదువులు చెప్పే ఆచార్య ఉద్యోగం మాత్రం రాజకీయ నియామకం కాదు.
అయితే.. ఆమెకు గౌరవ ఆచార్య నియామకం మాత్రమే చేశారని.. అది జీత భత్యాల కోసమేనని.. నిజంగా ఆమె వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పబోరని కొంత మంది అంచనా వేస్తున్నారు. ఒక వేళ తన సేవలు ఏయూ విద్యార్థులకు అందించకపోతే కేవలం ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కోసం ఆమెకు ఆ నియామకం అందించినట్లుగా భావిస్తారు. ఏదైతేనేం ఇటీవలే తెలుగులో ఆమె భాషా ప్రావీణ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడా భాషను ఏయూ విద్యార్థులకు నేర్పే అవకాశం దక్కించుకున్నారని అనుకోవచ్చు.