పెగాసస్ అంశం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ విపక్షాలు మాత్రమే ఆ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఎన్డీఏలోని కీలక మిత్రపక్షం జేడీయూ కూడా అదే బాట పట్టింది. బీజేపీని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించే బీహార్ సీఎం నితీష్ కుమార్ పెగాసస్ అంశంలోనూ … కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై విచారణ జరిపించాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు పార్లమెంట్‌లో కూడా చర్చించాలన్నారు. పెగసస్ పై చర్చించేందుకు విపక్షాలు పట్టుబడుతూంటే… సభలను వాయిదా వేయడానికైనా కేంద్రం సిద్ధమవుతోంది కానీ చర్చించేందుకు అంగీకరించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెగసస్ వ్యవహారంపై చర్చ జరిగితే.. కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని వీలైనంత లో ప్రోఫైల్‌లో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పెద్దగా చర్చకు అవకాశం ఇవ్వడం లేదు. రాజకీయంగానూ తక్కువస్థాయిలోనే స్పందిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు మాత్రం.. చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. విచారణ కోసం… మీడియా కూడా డిమాండ్ చేస్తోంది. మీడియా ప్రముఖులు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. వీటిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇలాంటి సమయంలో నితీష్ కుమార్ వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికరమే.
పెగసస్ నిఘాను కేవలం రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే వాడలేదు. సొంత నేతలు.. మిత్రపక్షాలపైనా ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే.. వారిలోనూ.. విచారణ జరగాలనే కోరిక బలంగా ఉంది. కానీ వారు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. కానీ విచారణ డిమాండ్ పెరిగే కొద్దీ వారికీ ధైర్యం వస్తోందని.. నితీష్ కుమార్ వంటి వారు హఠాత్తుగా విచారణకు డిమాండ్ చేయడంతోనే తెలిసిపోతోంది. ముందు ముందు ఇలాంటివాయిస్‌లు పెరిగితే… విచారణ చేయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.