కర్మ అనే మాటకు కర్తవ్యం అన్న అర్ఠం భగవద్గీతలో కృష్ణుడే ఇచ్చాడు. రామ్ గోపాల్ వళర్మ తీసే సినిమాలు ఎప్పుడు వస్తాయో పోతాయో తెలియదు గాని దానికి ముందు వెనక మీడియా ఇచ్చే ప్రచారం మాత్రం కంపరం ఎత్తిస్తుంటుంది. శివతో సహా కొన్ని తెలుగు సినిమాలు మరికొన్ని హిందీ సినిమాలతో ఆయన దేశంలోనే సంచలనం కలిగించిన సంగతి ఇప్పుడు చరిత్ర మాత్రమే. రెండు దశాబ్దాలలోనూ ప్రధానంగా తక్కువ ఖర్చు ఎక్కువ ప్రచారం తో సినిమాలు తీస్తూ ఇతరుల చిత్రాలపై కామెంట్లు చేస్తూ నెట్టుకొస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వ్యక్తిగత పొగడ్తలు తెగడ్దలతో సెక్సిస్టు రిమార్కులతో ఆయన వ్యూహాత్మకంగా వార్తలలో వుంటారు. ప్రతిభా వంతుడే కావచ్చు గాని వీటన్నిటితో తన స్థాయిని తనే తగ్గించుకున్నాడు. దయ్యాల సినిమాలు స్త్రీలను కించపర్చే చిత్రాలు తీసి ఒక దశలో తీవ్ర నిరసనకు కూడా గురైనాయి.నిర్మాతలు ముఖ్యంగా కొత్తవారినుంచి ఆయనపై ఫిర్యాదులు కూడా విన్నాను.వాటిపై విమర్శలకు కూడా తలాతోకలేని సమాధానాలిస్తుంటారు. బయోపిక్స్ గురించిన చర్చ పెరుగుతుంది గనక ఇప్పుడు వంగవీటి ప్రాజెక్టు తీసుకున్నారనుకోవాలి. నిజానికి తనే తీసిన శివ, గాయం వంటి వాటికన్నా తీసేందుకు ఇంకేమీ లేదు. చైతన్యరథం అచ్చంగా ఆ సోదరుల కథతోనే తీసి విజయం సాధించారు. ఇప్పుడు వర్మ దాన్ని మళ్లీ పట్టుకొని హడావుడి చేయడం హాస్యాస్పదం. ముందుగానే ఏదో ఆడియో క్యాసెట్ విడుదల చేయడం కూడా ఖర్చులేని ప్రమోషన్ ప్రహసనమే. పరిశ్రమలో ఎందరో శక్తివంతులు సృజన కారులు వుండగా ఒక్క వర్మ చుట్టూనే మీడియా సంస్థలుకొన్ని పరిభ్రమించడంలో పరమ రహస్యం ఏమిటో తెలియదు. తను సేలబుల్ అన్న ఒక్క సూత్రమే పనిచేస్తుందా? వీటి వల్ల గతంలో ఆడని సినిమాలు జరగని విచిత్రాలు ఇప్పుడు మాత్రం జరుగుతాయా? అవన్నీ ఎలా వున్నా ప్రచారం ప్రమోషన్ వుంటాయి గనక ఎవరైనా ‘బకరాలు’ దొరకొచ్చు కూడా.