కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మరోసారి ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించేందుకు తేదీ ఖరారు చేసుకుంది. సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించి అక్కడేమైనా పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. కేఆర్ఎంబీని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేదని నేరుగా వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కేఆర్ఎంబీ.. తేదీని ఖరారు చేసుకుంది. లాంఛనంగా సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే.. కమిటీలో తెలంగాణ ప్రతినిధులు వద్దని ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
నిజానికి కేఆర్ఎంబీ ఇప్పటికే పలుమార్లు ఆ ప్రాంతంలో పర్యటించాలని అనుకుంది. కానీ ఏపీ సర్కార్ వద్దే వద్దని తేల్చిచెబుతోంది. దీంతో రక్షణ ఉండదన్న కారణంగా కృష్ణాబోర్డు బృందం అక్కడ పర్యటించలేదు. ఎన్జీటీ ఆదేశాలను కూడా ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ సర్కార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ… ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడకు వెళ్లి పనులను పరిశీలించి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదో తేదీన కేఆర్ఎంబీ బృందం సిద్ధమయింది.
సీమ ఎత్తిపోతులకు అనుమతుల్లేవని.. అయినా నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని చాలా కాలంగా కృష్ణాబోర్డు కూడా ఏపీ ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం అక్కడ పనులేమీ జరగడం లేదని.. డీపీఆర్‌కు అవసరమైన సర్వే పనులు మాత్రమే చేస్తున్నామని చెబుతోంది. కానీ అక్కడ పూర్తి స్థాయి పనులు చేస్తున్నారని ఎన్జీటీకి ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిస్తోంది. గతంలోనే పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తే.. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని ఎన్జీటీ అప్పుడే హెచ్చరించింది.
కేఆర్ఎంబీ కమిటీని ఏపీ సర్కార్ అనుమతిస్తుందా.. అనుమతిస్తే ఆ కమిటీ ఏ రిపోర్టు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ పనులు జరుగుతున్నాయని నివేదిక ఇస్తే ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.