బిగ్ బాస్ వ్యవహారం వింతగా ఉంటుంది. షోలో ఉన్నంత సేపూ.. ఆ సెలబ్రెటీలకు బోల్డంత ప్రచారం, హైప్ వచ్చేస్తాయి. షో నుంచి బయటకు వచ్చీ రాగానే వెండి తెరపై విజృంభించేస్తారనుకుంటారంతా. కానీ… బిగ్ బాస్ అవ్వగానే సీన్ రివర్స్ అయిపోతుంది. బిగ్ బాస్ లో మెరిసినవాళ్లెవ్వరూ.. ఆ తరవాత సినిమాల్లో రాణించలేకపోయారు. మోనాల్ గజ్జర్ పరిస్థితీ అంతే. ఎన్ని సినిమాల్లో చేసినా రాని క్రేజ్, ఫ్రేమ్ బిగ్ బాస్ తో సంపాదించుకుంది మోనాల్. కానీ ఏం లాభం? దాన్ని క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది.
బిగ్ బాస్ నుంచి రాగానే… `అల్లుడు అదుర్స్`లో ఓ పాట చేసింది. ఈ పాటకు గానూ.. ఏకంగా రూ.15 లక్షలు వసూలు చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్. దాంతో పాటు.. మోనాల్ కి కూడా అవకాశాలు రాలేదు. చిన్న చిన్న ఆఫర్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లాంటివి.. మోనాల్ కి దక్కాయి. కానీ… భారీ పారితోషికాలు డిమాండ్ చేసి, తన దగ్గరకు వచ్చిన వాళ్లని బెదరగొట్టేసింది మోనాల్. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసిందట. స్టార్ హీరోయిన్లకే అంత ఇవ్వడం లేదు. అలాంటిది మోనాల్ కి ఎందుకిస్తారు? అందుకే వచ్చినవాళ్లు వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోయారు. ఓ సినిమాలో ఆఫర్ వస్తే.. `ఓకే` అనేసి, తీరా ఎగ్రిమెంట్లు పూర్తయ్యాక,.. `నా పారితోషికం పెంచాలి` అని గట్టిగా పట్టుబట్టడంతో సదరు నిర్మాత వెనక్కి వెళ్లిపోయాడు. అలా చేతులారా కొన్ని అవకాశాల్ని జారవిడచుకుంది. అయితే ఎట్టకేలకు మోనాల్ కి ఓ బంపర్ ఛాన్స్ దక్కింది. నాగార్జున `బంగార్రాజు`లో మోనాల్ కి ఓ అవకాశం దక్కింది. ఈ సినిమాలో మోనాల్ ఓ పాటలో కనువిందు చేయబోతోందని సమాచారం. `సోగ్గాడే చిన్ని నాయిన`లో అనసూయ ఓ పాటలో మెరిసింది కదా. అలాంటి హుషారైన పాటలో మోనాల్ కనిపించే ఛాన్సుంది. ఈసారి మాత్రం మోనాల్ పారితోషికం విషయంలో పేచీ పెట్టలేదట. ఎందుకంటే ఇది నాగ్ సినిమా. పైగా… రాక రాక వచ్చిన ఛాన్స్. కాబట్టి.. రాగానే ఒప్పేసుకుంది. ఈ పాటలో అయినా మోనాల్ తనని తాను నిరూపించుకుంటే.. ఇంకొన్నాళ్లు తెరపై కనిపిస్తుంది.