అత్త కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు బాధ అని ఓ సామెత.. ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు అంతే ఉంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. బయటకు మాత్రం వివరాలు తెలియడాన్ని తట్టుకోలేకపోతోంది. ఎప్పుడెప్పుడు ఎంత అప్పు తీసుకుంటున్నారు… ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు… ఎలా తీరుస్తున్నారు… ఎలా రొటేషన్ చేస్తున్నారు.. ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూండటంతో సమాచారం మొత్తం ఆర్థిక శాఖ నుంచే వెళ్తోందని అనుమానిస్తూ.. ముగ్గురు ఉద్యోగులపై తాజాగా వేటు వేశారు. ఉదయమే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ పేరు మీద జీవో జారీ చేసింది.. ఇందులో అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు, తో పాటు వరప్రసాద్ , శ్రీను బాబు అనే ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు కీలక సమాచారం బయటకు చేరవేస్తున్నారని ప్రభుత్వం అభియోగాలు మోపింది. విచారణ పూర్తయ్యే వరకూ హెడ్ క్వార్టర్ దాటి పోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖలోని అత్యంత గడ్డు పరిస్థితిని బయటకు రాకుండా ప్రభుత్వం చాలా వరకూ చర్యలు తీసకుుంది. అయితే మీడియా వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి.. ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి ప్రజల ముందు ఉంచుతోంది. బయటకు వస్తున్న విషయాలన్నీ… ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజల్లో పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో… సమాచారం ఎక్కడ నుంచి లీక్ అవుతుంతో అంతర్గత విచారణ జరిపారు. చివరికి అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు కారణం అనుకుని ఆయనతో పాటు మరో ఇద్దరిపై వేటు వేశారు.
అయితే.. ఇక నుంచి ఎలాంటి ఆర్థిక వివరాలు… ప్రభుత్వ అప్పుల సమాచారం బయటకు రాకపోతే మాత్రం వారే సమాచారం లీక్ చేశారనుకోవాలి. లేకపోతే… మాత్రం ప్రభుత్వం అసహనంతో ఆ ఉద్యోగులపై వేటు వేసిందనుకోవాలి. ప్రభుత్వం తీరుపై ఇప్పటికే ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. సమాచారం లీకవడానికి రాజకీయ నేతలే కారణం కానీ ఉద్యోగులు కాదని.. చెబుతున్నారు. అయినా.. రహస్యంగా ఉంచాల్సిన సమాచారమేదీ బయటకు రాలేదని.. ప్రజలకు తెలియాల్సినవే వచ్చాయని అంటున్నారు. మొత్తానికి ఉద్యోగ సంఘాలు నేతలు ఈ అంశంపై నోరు మెదుపుతారో లేదో స్పష్టత లేదు కానీ.. ఆర్థిక పరిస్థితి బయటకు తెలుస్తోందన్న కారణంగా ముగ్గురు ఉద్యోగులుపై మాత్రం సస్పెన్షన్ వేటు పడింది.